దారులన్నీ మూసుకున్నాయి దానం!

తనపై అనర్హత వేటు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దానం నాగేందర్ కు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు భారీ షాకిచ్చింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ దానం పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ సుప్రీం కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీ తరఫున పోటీ చేయడాన్ని తప్పుబట్టింది. అనర్హత వేటు వేసినందున ఉప ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక దాదాపుగా ఖాయం అయింది.

తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఏదైనా శాసన సభ స్థానం ఖాళీ అయిన 6 నెలల్లోపు అక్కడ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలో ఇక్కడ బై పోల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సి ఉంటుంది. 2023లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచిన దానం ఆ తర్వాత 2024 లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిన దానం నాగేందర్ పై కొద్ది రోజుల క్రితం అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దానం శాసన సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మొహమాటపడుతుండడంతో చివరకు తెలంగాణ హైకోర్టు ఆ పని చేయాల్సి వచ్చింది. అయితే, ఆ రోజు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పిన దానం ఎన్నికల్లో కొట్లాడేందుకు మొగ్గు చూపుతానని అన్నారు. అంతేకాదు, ఉప ఎన్నికకు నేను రెడీ…అంటూ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఆ తర్వాత దానం మనసు మార్చుకున్నారు.

మరి, ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు కావడంతో దానం ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులను స్పీకర్ గడ్డం ప్రసాద్ నిశితంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తన విచక్షణాధికారలను ఉపయోగించి ఏదైనా చేసే అవకాశముందా అని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది.