పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇందులో చైనా కూడా భాగస్వామి కావడం ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్‌కు అత్యంత సన్నిహిత దేశంగా ఉన్న చైనా కూడా ఈ ప్రకటనకు అంగీకరించింది.
2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని బ్రిక్స్ దేశాలు తమ ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించాయి. ఉగ్రవాదాన్ని ఎవరు, ఎక్కడ, ఏ కారణంతో చేసినా సమర్థించలేమని స్పష్టం చేశాయి. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ ఉండాలని పేర్కొన్నాయి.
కేవలం పహల్గామ్ దాడిని ఖండించడంతో బ్రిక్స్ ఆగలేదు. సరిహద్దులు దాటి ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, వారికి ఆశ్రయం కల్పించే సేఫ్ హెవెన్స్‌ను కూడా ప్రకటనలో ప్రస్తావించింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నవారితో పాటు వారికి సహకరించినవారిని కూడా చట్టం ముందు నిలబెట్టాలని పేర్కొంది.
అయితే డిక్లరేషన్‌లో ఎక్కడా పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కూడా ఈ ప్రకటనలో ప్రత్యేక ప్రస్తావన లేదు. పహల్గామ్ దాడిని మాత్రం పేరుతో పేర్కొంటూ బ్రిక్స్ దేశాలు ఖండించాయి.
పాకిస్థాన్‌కు చైనా చాలాకాలంగా కీలక మిత్రదేశం. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు ఇబ్బంది కలిగించే కొన్ని అంశాల్లో గతంలో చైనా భిన్నమైన వైఖరి తీసుకున్న సందర్భాలున్నాయి. అలాంటి చైనా ఇప్పుడు పహల్గామ్ దాడిని పేరుతో ప్రస్తావించిన బ్రిక్స్ డిక్లరేషన్‌కు అంగీకరించింది.
బ్రిక్స్ ప్రకటన మరో అడుగు కూడా వేసింది. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై అన్ని దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే ఐక్యరాజ్యసమితి పరిధిలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి అమల్లోకి తీసుకురావాలని సభ్య దేశాలు కోరాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates