వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి బ‌ల‌మైన నాయ‌కుడు ముందుండి న‌డిపిన విధానం.. ఇప్పుడు క‌నిపించకపోవ‌డంతో విశాఖ కార్పొరేష‌న్‌పై వైసీపీ కేడ‌ర్ దాదాపు ఆశ‌లు వ‌దిలేసుకుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీ విశాఖ‌లో తీవ్రమైన రాజకీయ సవాళ్లను, ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. గ‌తంలో వైసీపీ హ‌యాంలో జరిగిన గత గ్రేట‌ర్ విశాఖ కార్పొరేష‌న్‌ ఎన్నికల్లో 58 వార్డులను గెలుచుకుని మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుంది.

అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన ద‌రిమిలా.. స్థానికంగా తన పట్టును కోల్పోయింది. అంతేకాదు.. మేయర్ పీఠాన్ని కోల్పోవడం వైసీపీకి భారీ ఎదురుదెబ్బేన‌ని పరిశీల‌కులు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు కూటమి పార్టీలలో చేరిపోయారు. ఈ క్రమంలోనే 2025 ఏప్రిల్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో వైసీపీ ఓడిపోయింది.

దీంతో వైసీపీకి చెందిన గొలగాని హరి వెంకట కుమారి మేయర్ పదవిని, అలాగే డిప్యూటీ మేయర్ పదవులను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అదేస‌మ‌యంలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన కార్పొరేటర్లలో మెజారిటీ సభ్యులు అధికార కూటమి వైపు వెళ్ళిపోయారు. ఫ‌లితంగా కౌన్సిల్‌లో వైసీపీ బలం గణనీయంగా పడిపోగా, కూటమి బలం 70 దాటడంతో కార్పొరేషన్ పూర్తిగా కూట‌మి పార్టీల ఆధిప‌త్యంలోకి చేరిపోయింది. ప్ర‌స్తుతం వ‌స్తున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. వైసీపీ సన్నాహాలు చేస్తున్నా.. పెద్ద‌గా అలికిడి క‌నిపించ‌డం లేదు.

ప్రస్తుతం జీవీఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. వార్డుల సంఖ్యను 120 లేదా 150కి పెంచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వార్డులు పెరిగితే.. వైసీపీకి అనుకూలంగా ఓటు బ్యాంకు మ‌రింత త‌గ్గుతుంద‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి. అయితే.. కొంద‌రు నాయ‌కులు మాత్రం కార్పొరేష‌న్‌లో మేయ‌ర్ పీఠం త‌మ‌దేన‌ని డాంబికాలు ప‌లుకుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆ మేర‌కు కార్య‌క‌ర్త‌ల‌ను ముందుండి న‌డిపించే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. సో.. మొత్తంగా విశాఖ‌పై వైసీపీ ఆశ‌లు ఎన్నిక‌లకు ముందే గ‌ల్లంత‌య్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.