వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల ఎంపీటీసీలు, కడప జడ్పీలపై నా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో `వైనాట్ పులివెందుల` అనే నినాదాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైనాట్ పులివెందుల ఏమేరకు దూకుడుగా ఉంది? నాయకులు ఏమేరకు పనిచేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది.
వైసీపీకి బలమైన కంచుకోటగా ఉన్న పులివెందులను ఎలాగైనా చేజిక్కించుకోవాలని అధికార తెలుగుదేశం పార్టీ కూటమి, తమ పట్టును నిలుపుకోవాలని వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కూటమి వ్యూహం – ‘వై నాట్ పులివెందుల`. గత ఏడాది జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో లభించిన విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న టీడీపీ.. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించింది.
పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డిలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ పథకాలు, కూటమి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చేరికలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వైసీపీ నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. క్యాడర్ పెద్ద సమస్యగా మారింది. ఈ రోజు ఉన్న కార్యకర్తలు తెల్లారేసరికి ఎటు మొగ్గుతారన్నది పార్టీకి కొరుకుడు పడడం లేదు.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని వైసీసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పులివెందులలో ఇటీవల నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ వేదికగా నాయకులతో మాట్లాడిన ఆయన, అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తారని, దానికి అస్సలు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలోనూ పోటీకి సిద్ధం కావాలని క్యాడర్‌ను అప్రమత్తం చేశారు. అయితే.. ఆ మేరకు కార్యకర్తలు పనిచేస్తారా? అనేది ప్రశ్న.
ప్రచారంలో ప్రధానాంశాలు:
కూటమి నేతలు తాము అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, ‘సూపర్ సిక్స్’ హామీలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నేతలు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమం, స్థానిక సెంటిమెంట్‌ను నమ్ముకుని ప్రచారంలోకి దిగుతున్నారు. అయితే.. వీరు పెద్దగా కనిపించడం లేదు. ఒకటి రెండు మండలాల్లో మాత్రమే వైసీపీ కొంత మెరుగ్గా ఉంది. మొత్తంగా పులివెందులలో ఇరు పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనిస్తే.. వైనాట్ పులివెందుల నిలబెట్టుకునేందుకు కూటమి మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని స్థానిక విశ్లేషకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates