వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన తన అరెస్టు ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు జరిగిన ఘటనలను సభలో వివరించారు. జగన్ నైజాన్ని, జగన్‌పై మాజీ సీఎం రోశయ్య చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ పాలకులు మూడేళ్ల క్రితం తనను అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారని తెలిపారు. మూడేళ్ల క్రితం సెప్టెంబరు 9వ తేదీన తనను అన్యాయంగా అరెస్టు చేశారని, ఏ తప్పు లేకుండా అరెస్టు చేయడం బాధ కలిగించిందని చెప్పారు.
48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, 31 ఏళ్ల క్రితం తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని చంద్రబాబు తెలిపారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలని, పేద ప్రజలకు, తెలుగు జాతికి న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నానన్నారు. చాలా మంది తనపై ఆరోపణలు చేసి కోర్టులకు వెళ్లారని, తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోయారని చెప్పారు. అదే తన నిబద్ధత అన్నారు. రాజకీయంపై కుటుంబం ఆధారపడకూడదనే ఉద్దేశంతో 36 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారాన్ని ప్రారంభించామని తెలిపారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున కుటుంబ వ్యాపారాన్ని తన సతీమణికి అప్పగించానన్నారు. తనకు ధన వ్యామోహం లేదని, కేవలం తెలుగు జాతి బాగుండాలనే నిరంతరం ఆలోచన చేస్తానని చెప్పారు.
నంద్యాలలో ఓ సమావేశానికి వెళ్లిన తనను అరెస్టు చేస్తామని అర్ధరాత్రి వచ్చారని చంద్రబాబు తెలిపారు. తనపై ఆరోపణలు ఏమిటో చెప్పాలని అడిగితే.. అరెస్టు చేసిన తర్వాత చెబుతామని అన్నారని చెప్పారు. ఓ మాజీ ముఖ్యమంత్రిని ఉన్నపళంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారని అన్నారు. తన జీవితంలో ఎన్నడూ అనుకోని సంఘటన ఓ దుర్మార్గమైన వ్యక్తి ఆలోచనల వల్ల జరిగిందని వ్యాఖ్యానించారు. తాను జైల్లో ఉన్న సమయంలో తనకు ఏమి జరుగుతుందోనని తెలుగు జాతి మొత్తం రోడ్లపైకి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో కొందరు అడ్డుపడినా టెకీలు కూడా ముందుకు వచ్చి నిరసనలు తెలిపారని చెప్పారు. దేశవిదేశాల్లోని తెలుగు వారంతా కదలి వచ్చారని, పవన్ కల్యాణ్ తనకు సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే ఆయననూ అడ్డుకున్నారని తెలిపారు. అయినా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పవన్ కల్యాణ్ తనకు సంఘీభావం తెలిపారని చెప్పారు.
గత పాలకులు పెట్టిన కేసులను కోర్టులు కొట్టేశాయని చంద్రబాబు తెలిపారు. ఈడీ లాంటి సంస్థలు కూడా ఇందులో ఏమీ లేదని తేల్చాయని చెప్పారు. గతంలో అచ్చెన్నాయుడు లాంటి నేతలను బలవంతంగా అరెస్టు చేసి వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ విశాఖ వెళ్తే ఆయన్ను అక్కడి నుంచి బలవంతంగా వెనక్కు పంపించారని, ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్క నిముషం చాలని, కానీ తాను ఆ పని చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. చాలా సౌమ్యంగా ఉంటానని, ఏం చేయలేకపోతున్నానని చాలా మంది అనేవారని.. కానీ తనకు సహనం ఎక్కువని చెప్పారు. తాను చేసే ఏ పని అయినా అది తెలుగు జాతికి న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.
జగన్ నైజంపై రోశయ్య వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..
మాజీ సీఎం వైఎస్సార్‌కు ఆయన కొడుకు విషయంలో జాగ్రత్తలు తీసుకోమని ఆనాడే చెప్పానని చంద్రబాబు తెలిపారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడ్ని ఆయన తండ్రి వైఎస్సార్ చదువుకోవడానికి అమెరికా పంపిస్తే తిరుగుటపాలో వచ్చేశాడని, ఈ విషయం స్వయంగా వైఎస్సారే చెప్పారని అన్నారు. కొడుకుతో బాధలు భరించలేక అతన్ని వైఎస్సార్ బెంగళూరులోనే ఉంచారని తల్లి విజయమ్మ మాజీ సీఎం రోశయ్యకు చెప్పుకుని బాధపడ్డారని, రోశయ్యే స్వయంగా ఈ విషయం చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఓ సీఎంగా ఉన్న వ్యక్తి తన కుమారుడిని బెంగళూరు లాంటి చోట పెట్టాడంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎలాంటి వాడో అర్థం చేసుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన కొడుకును ఎప్పుడూ ఏపీకి రానీయలేదన్నారు. బాబాయి వివేకాను గొడ్డలి వేటుతో కిరాతకంగా చంపేశారని ఆరోపించారు. తెల్లవారితే సీఎంగా ఉన్న తనపై నింద వేసి తన పత్రికలో రాయించారని అన్నారు. తన చెల్లి సునీతను కూడా ఏమార్చారని ఆరోపించారు. ఆ రోజే దోషులందరినీ అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు తల్లిని, చెల్లినీ కూడా ఆస్తి కోసం మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అలాంటి వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates