అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్లాల ఇంచార్జ్‌ల నుంచి పార్టీ సీనియ‌ర్ల వ‌ర‌కు చాలా మంది పార్టీ కాడి ప‌డేశారు. ఇప్పుడు తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కీల‌క సామాజిక వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరున్న మ‌జ్జి శ్రీనివాస‌రావు పార్టీ మారిపోయారు. ఇది వైసీపీకి ఊహించ‌ని ప‌రిణామం. అయితే.. ఆయ‌న చెప్పిన మాట‌ల ప్ర‌కారం.. మ‌రింత మంది వైసీపీ నాయ‌కులు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీ ఉన్నార‌ని చెప్పారు. ఇది నిజ‌మేన‌న్న‌ది మ‌రికొంద‌రు నేత‌లు చెబుతున్న మాట‌.

ఎందుకు..?

వైసీపీ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డానికి మూడు కార‌ణాలు ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి. 1) పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ము లాట‌లు పెచ్చ‌రిల్ల‌డం. ముఖ్యంగా కొద్దిమంది ఆధిపత్య ధోర‌ణిని చాలా మంది నాయ‌కులు స‌హించ‌లేక పోతున్నారన్న‌ది వాస్త‌వం. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చాలా మంది నాయ‌కులు ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. మ‌రికొంద‌రు `మ‌న‌కెందుకులే` అన్న‌ట్టుగా బ‌య‌ట‌కు వ‌చ్చినా మౌనంగా ఉన్నారు. ఇక‌, పార్టీ ప‌రంగా స‌జ్జ‌ల‌పై ఆగ్ర‌హం ఉన్నా.. కొంద‌రు స‌ర్దుకు పోతున్నారు. వీరిలో చాలా మంది `అవ‌కాశం` కోసం ఎదురు చూస్తున్నారు.

2) జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి: కింద ప‌డ్డా పైచేయి అనే టైపులో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు సీనియ‌ర్ల‌కు కంట్లో న‌లుసుగా మారుతోంది. ప్ర‌జాభిప్రాయాన్ని, ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం.. దానికి అనుగుణంగా పార్టీని ముందుకు న‌డిపించే విష‌యంలో జ‌గ‌న్ పూర్తిగా వెనుక‌బ‌డ్డార‌న్న వాద‌న సీనియ‌ర్ల‌లో వినిపిస్తోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి పాల‌న వ‌ర‌కు.. అనేక విష‌యాల్లో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై వ్య‌తిరేక‌త ప్ర‌బ‌లంగా క‌నిపిస్తోంది. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ఆలంబ‌న‌గా చేసుకుని ముందుకు సాగాల్సిన జ‌గ‌న్‌.. ఈ విష‌యంలో వెనుక‌బ‌డ్డార‌న్న‌ది సీనియ‌ర్లు బాహాటంగానే చెబుతున్నారు.

3) మ‌ళ్లీ కూట‌మి: రాష్ట్రంలో మ‌రోసారి కూడా కూట‌మి స‌ర్కారు వ‌స్తుంద‌న్న బ‌ల‌మైన న‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఇది కూడా వైసీపీ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం క‌ల్పిస్తోంది. కూట‌మిలో భిన్నాభిప్రాయాలు కొన్ని ఉన్న‌ప్ప‌టికీ.. పైస్థాయిలో నాయ‌కులు క‌లివిడిగా ఉన్నారు. ఇక‌, కూట‌మి మ‌రోసారి వ‌స్తుంద‌ని.. కొన్ని చోట్ల సీట్లు త‌గ్గినా.. అధికారం మాత్రం కూట‌మిదేన‌ని.. ప‌లు స‌ర్వేలు కూడా చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో వైసీపీలో నాయ‌కులకు గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఏదేమైనా మ‌జ్జి శ్రీనివాస‌రావు చెప్పిన‌ట్టు.. మ‌రికొంద‌రు నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తే.. పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.