ఈ ట్రంపు మాకొద్దు… బాబోయ్‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మ‌ధ్యంతర ఎన్నిక‌ల సెగ భారీగా త‌గిలేలా క‌నిపిస్తోంది. మ‌ధ్యంతర ఎన్నిక‌లు వ‌చ్చే అక్టోబ‌రు-న‌వంబ‌రు మాసాల మ‌ధ్య జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం డెమొక్రాట్లు, అధికార ప‌క్షం రిప‌బ్లిక‌న్‌లు హోరోహోరీగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునేందుకు ప‌లు స‌ర్వే సంస్థ‌లు రంగంలోకి దిగాయి. ఈ సంస్థ‌లు చేస్తున్న స‌ర్వేల్లో ట్రంప్‌కు ఓటేసేది లేద‌ని అమెరికా పౌరులు తెగేసి చెబుతున్నారు. ఈ ట్రంపు మాకొద్దు బాబోయ్ అంటూ.. చేతులు ఎత్తేస్తున్నారు.

ఎందుకిలా?

క‌ర్ణుడి చావుకు కోటి కార‌ణాల‌న్న‌ట్టుగా.. ట్రంప్‌కు రెండోసారి పాల‌నా ప‌గ్గాలుచేపట్టిన‌ ఏడాదిన్న‌ర‌లోనే ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైంది. ప్ర‌పంచ దేశాల‌మ‌ధ్య శాంతిని తీసుకువ‌స్తాన‌ని.. ఈ క్ర‌మంలో తాను అహోరాత్రులు శ్ర‌మిస్తాన‌ని ట్రంప్ ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారు. కానీ, ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతుండ‌డం. ముఖ్యంగా ఇరాన్‌పై యుద్ధం, ఇజ్రాయెల్‌తోనూ క‌య్యం వంటి విష‌యాలు అమెరిక‌న్ల‌ను విస్తుపోయేలా చేస్తున్నాయి.

ఇక‌, ఈ యుద్ధాల కార‌ణంగా అమెరికాలో నిత్యావ‌స‌రాలు.. ముఖ్యంగా ఫుడ్ స్టంట్స్ ధ‌ర‌లు ఆకాశానికి చేరి పోయాయి. మ‌రోవైపు ప్ర‌పంచ దేశాల‌పై విధిస్తున్న భారీ సుంకాల కార‌ణంగా కూడా.. ప్ర‌జ‌ల‌కు ధ‌ర‌ల మంట జోరుగా తాకుతోంది. దీంతో స‌హ‌జంగానే ట్రంప్‌పై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. మ‌రోవైపు.. నిరుద్యోగ స‌మ‌స్య దేశాన్ని ప‌ట్టిపీడిస్తోంది. దీంతో యువత ఒక‌ప్పుడు ట్రంప్‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌గా.. ఇప్పుడు వారే పెద్ద ఎత్తున వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌పంచాన్ని జ‌యిస్తాన‌న్న ట్రంప్‌కు ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేక‌పోవ‌డం.. ఇరాన్ వంటి దేశం నుంచే ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతుండ‌డం కూడా.. ఆయ‌న ఇమేజ్‌కు డ్యామేజీ చేసింది.

ఈ ప‌రిణామాల‌న్నీ.. అమెరికాలో జ‌రుగుతున్న మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ప‌డేలా చేస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థుల‌కు ఓటేసేది లేద‌ని మెజారిటీ అమెరిక‌న్లు చెబుతున్నారు. దీంతో ఇప్పు డు ట్రంప్ ఏదైనా చ‌ర్య‌లు తీసుకుని.. ప్ర‌జ‌ల‌ను మురిపిస్తే త‌ప్ప‌.. రిప‌బ్లిక‌న్ల‌కు ఊర‌ట ల‌భించే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని.. ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం స‌ర్వేల్లో వ‌స్తున్న వార్త‌లు.. స‌మాచార‌న్ని ట్రంప్ త‌ప్పుబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. త‌న‌ను కావాల‌నే టార్గెట్ చేస్తున్నారని.. శ‌త్రువుల‌తో క‌లిసి.. అమెరికాను నాశ‌నం చేయాల‌ని స‌ర్వే సంస్థ‌లు చూస్తున్నాయ‌ని.. ఆయ‌న ఆరోపిస్తున్నారు.