తెలంగాణ అసెంబ్లీ: లోప‌ల కాదు… బ‌య‌టే ర‌ణ‌రంగం!

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల‌ స‌మావేశాలు ప్రారంభం రోజే.. ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించాయి. పోలీసులు వ‌ర్సెస్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదం.. తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. ఇది.. ఏకంగా చొక్కాలు విప్పే వ‌రకు వ‌చ్చింది. మ‌రోవైపు.. త‌న చీరను లాగారంటూ.. మాజీ మంత్రి సునీతా ల‌క్ష్మారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేసి కంట త‌డిపెట్టుకున్నారు. ఇక‌, అసెంబ్లీ గేటు వ‌ద్దే.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను పోలీసులు అడ్డుకోవ‌డం.. వారిలో కొంద‌రిని అరెస్టు చేయ‌డం జ‌రిగిపోయాయి.

ఎందుకు?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. వెయ్యి రోజుల పాల‌న పూర్తి చేసుకుంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం సంబరాల‌కు పిలుపునివ్వ‌గా.. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం.. గ‌న్ పార్కు నుంచి నిర‌స‌నగా అసెంబ్లీకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేసింది. దీనిని అడ్డుకునే ప్ర‌య‌త్నంలో పోలీసులు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త‌త‌కు దారితీసింది. పోలీసులు త‌మ‌పై భౌతిక దాడికి దిగార‌ని కొంద‌రు ఎమ్మెల్యేలు ఆరోపించారు.

మాజీ మంత్రి హ‌రీష్‌రావును పోలీసులు అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న టీష‌ర్టును విప్పేసి పోలీసుల తీరుకు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. మాజీ మంత్రులు సునీతా ల‌క్ష్మారెడ్డి, స‌బితా ఇద్రారెడ్డిలు.. కూడా త‌మ‌పై పోలీసులు భౌతికంగా దాడి చేశార‌ని ఆరోపిస్తూ.. నిర‌స‌న‌లకు దిగారు. ఈ ప‌రిణామాల‌తో అసెంబ్లీలో లోప‌ల‌క‌న్నా కూడా.. బ‌య‌టే ఎక్కువ‌గా ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి.

రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌ల‌కు బీఆర్ ఎస్ పిలుపునిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశ‌పూర్వ‌కంగా.. త‌మ‌ను అడ్డుకుంటున్నార‌ని.. అసెంబ్లీలోకి రాకుండా చేస్తున్నార‌ని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. జగదీష్ రెడ్డికి హైబీపీ ఉందని చెప్పినా అడ్డుకున్నారని, రేవంత్ ఆదేశాలతోనే పోలీసులు రెచ్చిపోయారని అన్నారు. పోలీసులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చ‌రించారు.

కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధ‌రించిన టీష‌ర్టుల‌పై అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని అందుకే అడ్డుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. దీనిపైనా హ‌రీష్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “మా టీషర్ట్ లపై అభ్యంతరకర పదాలెక్కడున్నాయి?. సభకు రాకుండా మమ్మల్ని కావాలనే అడ్డుకున్నారు. మేం సభలో లేనప్పడు 22- Aపై చర్చ ఎలా జరుపుతారు?. కావాలనే మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. మా సభ్యులను రక్తాలు వచ్చేలా కొట్టారు.“ అని హ‌రీష్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.