మోదీ ఈవెంట్‌కు కూడా బుక్‌మైషో టికెట్లా…

సినిమా చూడాలంటే బుక్‌మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా అదే ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్ పెట్టారు. గుజరాత్‌లోని వడోదరాలో సెప్టెంబర్ 8న జరిగే నామో ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమానికి బుక్‌మైషో ద్వారా ఉచితంగా సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన గంటలోనే అందుబాటులో ఉన్న సీట్లు మొత్తం ఫుల్ అయ్యాయి. 

మరో 42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ బుక్‌మైషోను పేర్లు నమోదు చేసుకోవడానికి మాత్రమే వాడటం లేదు. రిజిస్టర్ అయిన వారికి వారి అకౌంట్‌లోనే M టికెట్ వస్తుంది. అందులో లైవ్ క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. కార్యక్రమం దగ్గరకు వెళ్లినప్పుడు ఆ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ నుంచి ఎంట్రీ, వెరిఫికేషన్, సీటింగ్ వరకు మొత్తం డిజిటల్‌గా నిర్వహించేందుకు వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ ఈ సిస్టమ్‌ను ఉపయోగిస్తోంది.

ఈ కార్యక్రమం కోసం దాదాపు 35 వేల సీట్లు అందుబాటులో ఉంచినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అవి గంటలోనే బుక్ కావడంతో మరో 42 వేల మంది వెయిటింగ్‌లోకి వెళ్లారు. ప్రధాన వేదికలో చోటు దొరకని వారికి కార్యక్రమాన్ని చూసేందుకు ప్రత్యేక ఫ్యాన్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మోదీ ఈ పర్యటనలో రూ.35 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మూడు వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ సెక్షన్లను జాతికి అంకితం చేయడంతో పాటు కొత్త రైలు సర్వీసులు, రైల్వే, హైవే ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.