ప్రైవేటు స్కూళ్లు ఎవరివైనా సరే…

ఏపీలోని ప్రైవేటు స్కూళ్లు దాదాపు ప్ర‌స్తుతం రాజ‌కీయ నేత‌ల చేతుల్లోనే ఉన్నాయి. దీంతో స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యాల‌కు ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. తాజాగా ప్ర‌భుత్వం వేసిన అంచ‌నాల ప్ర‌కారం.. రాష్ట్రంలో 70 శాతం మేర‌కు ప్రైవేటు స్కూళ్లు.. అధికార‌, ప్ర‌తిప‌క్ష(ప్ర‌ధాన కాదు) పార్టీల నేతల‌కు చెందిన వారే నిర్వ‌హిస్తున్నారు. మిగిలిన 30 శాతం మంది మాత్ర‌మే ఇండివిడ్యువ‌ల్‌గా నెట్టుకు వ‌స్తున్నారు.

దీంతో ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌ను ప్రైవేటు స్కూళ్లు పాటించ‌డం లేదు. ముఖ్యంగా పేద‌ల‌కు 25 శాతం మేరకు ఉచితంగా సీట్లు ఇవ్వాల‌న్న నిర్ణ‌యాన్ని 60 శాతం స్కూళ్లు పాటించ‌డం లేదు. దీనిలో 55 శాతం రాజ‌కీయ కుటుంబాల‌కు చెందిన పాఠ‌శాల‌లే ఉన్నాయ‌ని లెక్క‌తేలింది. దీంతో స‌ర్కారు అలెర్ట్ అయింది. ఈ పరిణామాల‌ను ఇలా చూస్తూ కూర్చుంటే.. మొత్తానికే మోసం వ‌చ్చేలా చేస్తుంద‌ని భావించిన ప్ర‌భుత్వం.. వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది.

కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు.. పేద వ‌ర్గాల‌కు మెరుగైన విద్య‌ను అందించేందుకు వీలుగా ఆ 25 శాతం సీట్ల‌ను ప‌క్కాగా పేద పిల్ల‌ల‌కే అందించేలా కీలక నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబంధించి అనుస‌రించాల్సిన విధి విధానాల‌పై అధ్య‌య‌నం చేసి.. ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చేలా.. ఒక కీల‌క క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ అన్ని కోణాల్లోనూ అధ్య‌య‌నం చేసి ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నుంది.

కార్పొరేట్ పాఠ‌శాల‌ల్లో పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం సీట్లు పూర్తిస్థాయిలో అందేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు శుక్ర‌వారం విడుద‌ల చేసిన జీవోలో ప్ర‌భుత్వం పేర్కొంది. మొత్తంగా 16 మందితో కూడిన క‌మిటీని నియ‌మించింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారి యా ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి తీసుకువ‌చ్చేందుకు స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని జీవోలో పేర్కొన్నారు.