తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు వ‌రాలు…

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం రెండో ద‌శ ఉద్య‌మం చేప‌ట్టిన స‌మ‌యంలో వంద‌ల మంది త‌మ ప్రాణాల‌ను త్యాగం చేశారు. ఊరూ వాడా ఏకం చేసి.. తెలంగాణ కోసం పోరుబాట ప‌ట్టారు. అయితే.. వారిని గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం విస్మ‌రించింద‌ని ఆరోపించిన ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు.. అధికారంలోకి వ‌చ్చాక వారిని గుర్తిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ హామీ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్నాళ్ల కింద‌ట‌.. తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను గుర్తించి.. వారికి మెరుగైన జీవితం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ సంస్మ‌ర‌ణ స‌భ‌లో కూడా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ నాయ‌కులు కే. కేశ‌వ‌రావు, ప్రొఫెస‌ర్ కోదండ రామ్‌, రాములు నాయ‌క్‌, శోభ‌న్ రెడ్డితో కూడిన క‌మిటీని నియ‌మించారు. వీరు తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను గుర్తించి.. వారి వివ‌రాలు, వారు చేసిన పోరాటాల‌ను ప్ర‌భుత్వానికి అందించాల‌ని గ‌తంలోనే ఆదేశించారు. తాజాగా ఈ క‌మిటీ స‌భ్యులు సీఎం రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు. త‌మ‌కు అందిన స‌మాచారం, తాము ప‌రిశీలించిన వివ‌రాల‌ను రేవంత్‌కు నివేదిక రూపంలో అందించారు. అలాగే ఉద్య‌మ సంఘాల జేఏసీల‌తోనూ ఈ క‌మిటీ స‌భ్యులు చ‌ర్చించారు. ఆ వివ‌రాల‌ను కూడా ఈ నివేదిక‌లో పొందు ప‌రిచారు.

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఉద్య‌మ కారుల వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా పేర్కొనాల‌ని.. దీనిపై ఎలాంటి విమ‌ర్శ‌లు రావ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే.. ఏ ఒక్క‌రికీ అన్యాయం జ‌ర‌గ‌రాద‌ని కూడా తెలిపారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా నివేదిక‌ను మ‌రోసారి అధ్య‌య‌నంచేయాల‌ని.. త్వ‌ర‌గా ప్రక్రియ‌ను పూర్తి చేయాల‌ని కోరారు. గ‌త ప్ర‌భుత్వం ఉద్య‌మ కారుల క‌ష్టాన్ని వాడుకుంద‌ని.. ఆ ప‌రిస్థితి మారాల‌ని.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆయా కుటుంబాల‌కు అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. ఉద్య‌మ‌కారుల‌కు ప్ర‌భుత్వం భారీ మేలు చేయాల‌ని త‌ల‌పోస్తోంది.

ప్రాధ‌మికంగా చేసే మేళ్లు ఇవి..
1) ప్ర‌తి కుటుంబానికీ ఉచితంగా 250 గ‌జాల స్థ‌లం.
2) జీవిత కాల పింఛ‌ను(ప్ర‌త్యేకంగా జీవో చేస్తారు)
3) ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేలా బ‌స్సు సౌక‌ర్యం(అన్ని బ‌స్సుల్లోనూ)
4) జీవిత‌కాలం చెల్లుబాటు అయ్యేలా ఆరోగ్య కార్డులు.
5) ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా పిలుపు.