నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ వివరణనిచ్చినా కాంగ్రెస్ హై కమాండ్ సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఈ సారి కొండా సురేఖ నేరుగా సంచలన విమర్శలు చేయడం షాకింగ్ గా మారింది.

తనపై చర్యలు తీసుకోవడానికి ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ డిమాండ్ చేసిన వైనం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. పదేళ్ల పాటు తానే సీఎం అని రేవంత్ చెప్పుకుంటున్నారని, అలా చెప్పడంతో మంత్రులు, నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆమె అన్నారు. బీసీలకో న్యాయం, ఇతర వర్గాలకో న్యాయమా? అని ప్రశ్నించారు. బీసీ మహిళా నేత అయిన తనకు ఒక
న్యాయం.. ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయం పాటిస్తారా? అంటూ సురేఖ ప్రశ్నించారు.

రేవంత్ కేబినెట్లో ఇతర సామాజిక వర్గాలకు చెందిన కొందరిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాలపై ఇప్పటికే రాహుల్, ప్రియాంక సహా అధిష్ఠాన పెద్దలకు రాతపూర్వకంగా తెలిపానని అన్నారు. ఇక, ఢిల్లీలో తనను రాజీనామా చేయమని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదని తెలిపారు. హై కమాండ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.

అయితే, ఇప్పటికే పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై వేటు వేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిపి ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి గట్టి పట్టు పట్టారని తెలుస్తోంది. మరోవైపు, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా కొందరు ఎంపీలు కాంగ్రెస్ హై కమాండ్ కు చెప్పారని తెలుస్తోంది. ఏది ఏమైనా కొండా సురేఖ వర్సెస్ రేవంత్ ఎపిసోడ్ కు త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.