మజ్లిస్ నుంచి ఎమ్మెల్సీ సస్పెండ్, కారణం అదేనా?

హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ గురించే చర్చ జరుగుతుంది. రహ్మత్ బేగ్ ను మజ్లిస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణాలు వెల్లడించనప్పటికీ ఒక వీడియో లీక్ వివాదమే ఆయనను ఇంటికి పంపించిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ వీడియోలో ఏముందన్నదనే విషయం మీద పాత బస్తీలో రకరకాల కథనాలు ప్రచారంలో వున్నాయి. ఏదో సీరియస్ వివాదం కాబట్టే మజ్లిస్ అధిష్టానం అంత పెద్ద నిర్ణయం తీసుకుందని బస్తీ నాయకులు చర్చించు కుంటున్నారు.

2023 స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్ బేగ్ కు 2029 వరకు కాలపరిమితి వుంది. అయినప్పటికీ రెండేళ్ల ముందుగానే ఆయనను మజ్లిస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించాలని హుకుం జారీ చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఈ మేరకు ఎంఐఎం సంయుక్త కార్యదర్శి హుసేన్ అన్వర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రహ్మత్ బేగ్ ను సస్పెండ్ చేయడానికి కారణం చెప్పలేదు. దాంతో ఎవరికీ తోచింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజానికి రహ్మత్ బేగ్ హైదరాబాద్ లో లేరు. ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లి వున్నారు. అయినా సరే ఆయన్ను హైదరాబాద్ కు పిలిపించి వేటు వేశారు.

కొన్ని రోజులుగా పాత బస్తీలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ప్రకారం… ఆత్తాపూర్ లో ఒక మైనర్ బాలికపై ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ లైంగిక దాడికి పాల్పడి స్థానికులకు రెడ్ హ్యాండ్ గా పట్టు బడినట్లు తెలుస్తుంది. దాంతో అగ్రహానికి గురైన స్థానిక యువకులు రహ్మత్ బేగ్ ను పట్టుకొని చితకబాదినట్లు సమాచారం. ఈ మొత్తం యవ్వారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రహ్మత్ బేగ్ గలీజు పని బయట పడిందని పాత బస్తీ కోడై కూస్తుంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మీద ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్స్పందించారు. అదంతా ఒట్టి అబద్దమని కొట్టి పారేశారు. ఈ వీడియో మీద హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తనపై డీప్ ఫేక్, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను బయట పెడతామంటూ కొందరు వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఎవరు బెదిరిస్తున్నారో వారి పేర్లను ప్రస్థావించక పోవడం గమనార్హం. వాస్తవం ఏమైనా కావొచ్చు కానీ రహ్మత్ బేగ్ ఫిర్యాదుతో వీడియో వైరల్ అవుతున్న మాట మాత్రం వాస్తవమేనని తేలింది.

ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ వ్యవహారంతోనే మజ్లిస్ పార్టీ తలపట్టుకుంటే బీఆర్ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మరో బాంబు పేల్చడం మరింత సంచలనంగా మారింది. రహ్మత్ బేగ్ వ్యవహారంలో మజ్లిస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్ పాత్ర కూడా వుందని, దానికి సంబందించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సల్మాన్ ఖాన్ చెబుతున్నారు.

రహ్మత్ బేగ్ ఆకృత్యాలు హైదరాబాద్ ప్రజలందరికి తెలియాల్సిన అవసరం వుందని, ఆయనను మజ్లిస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో, ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయించారో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీడియా ముందుకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది మజ్లిస్ పార్టీ నాయకుల్లో గుబులు రేపుతుంది. మజ్లిస్ లో ఈ సస్పెండ్ వ్యవహారం రహ్మత్ బేగ్ తో ఆగుతుందా మరి కొందరి మీద కూడా పడుతుందా అనేది వేచి చూడాలి.