కొండా ఫ్యామిలీ ప్లాన్-బీ ఏంటో తెలియట్లేదు

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో మంత్రి కూతురు సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంతో హస్తం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మొదట కొండా సుస్మిత వర్సస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నట్లు మొదలైన ఈ వివాదం సీఎం రేవంత్ రెడ్డి వర్సస్ మంత్రి కొండా ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన విమర్శలు కాంగ్రెస్ పార్టీని ఒక ఊపు ఊపేసింది. చివరికి క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇవ్వడంతో  ఆట ఫైనల్ కు చేరింది. 

ఈ నేపథ్యంలో కొండా సురేఖ భర్త కొండా మురళి బుధవారం ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో సమావేశమావడం కాక పుట్టిస్తుంది. అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ… తన కూతురు సుస్మిత చేసిన విమర్శలకు వివరణ ఇచ్చారు. సుస్మిత విమర్శలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి పడేశారు. నా బిడ్డ ప్లాన్ -ఏ ప్రకారం విమర్శలు చేసింది, ప్లాన్ -బీ ఏమిటో మాకు తెలియదని చెప్పడం రాజకీయ ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చినట్లయిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

మరోవైపు మంత్రి కొండా సురేఖ హనుమకొండలోని రాంనగర్ లో గల తన నివాసంలో వున్నట్లు సమాచారం. సురేఖ పై వేటు వేయాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్స్ చేసిన నేపథ్యంలో రెండు రోజులుగా ఎవరికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి సురేఖ స్పందించే అవకాశం వుందని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆమె మౌన దీక్షలో ఒంటరిగా వున్నట్లు చెబుతున్నారు. 

ఈ లోపు కొండా మురళి నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ప్రజా భవన్లో డీసీఎం భట్టి విక్రమార్కను కలిసినట్లు ప్రచారం జరుగుతుంది. చివరి ప్రయత్నంగా మేము కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళేది లేదని చెప్పినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై సంపూర్ణ విశ్వాసం వుందని చెప్పడం ఇందులో భాగమేనని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ సురేఖ మీద అధిష్టానం వేటు వేస్తే తదుపరి ప్లాన్ ఏమిటో కూడా మురళి చెప్పేశారు. తన కూతురు సుస్మిత ప్లాన్ -బీ ఏమిటో తెలియదని చెప్పడం ద్వారా అధిష్టానానికి ఒక సంకేతం ఇచ్చినట్లుగా వుందని చెబుతున్నారు. 

అయితే కాంగ్రెస్ అధిష్టానం కనుక కొండా సురేఖ మీద వేటు వేస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలన్న ఆలోచనలో కొండా ఫ్యామిలీ వున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమె ఇప్పటికే బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు కొందరు చెవులుకొరుక్కుంటున్నారు. అదే జరిగితే తెలంగాణా రాజకీయాలు మరింత వేడి రాజుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.