వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి పార్టీ సిద్ధాంతమని, వాళ్లు నేరాలు చేసి ఎదుటివారిపై ఆరోపణలు చేయడం వాళ్లకు అలవాటని విమర్శించారు. గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, దాన్ని సరిచేసేందుకు రెండున్నరేళ్లు పట్టిందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి సోమవారం కడప జిల్లాలో పర్యటించారు. జల్‌జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పనులను ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…

వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు జగనే అని, అన్నీ వేళ్లు అతని వైపే చూపిస్తున్నాయని ఆరోపించారు. నేను 2019 నాటి ముఖ్యమంత్రిని కాదు.. 4.0 సీఎంని’ అంటూ స్పష్టం చేశారు. వివేకా కేసు, లిక్కర్ కేసు నిందితులకు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. డీఎస్సీ -2026 లో అక్రమాలు జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ తన హయాంలో గ్రూప్ -1 నియామకాల్లో జరిగిన అక్రమాల గురించి ఎందుకు సమాధానం చెప్పడని ప్రశ్నించారు.

ప్రభుత్వం నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గా అప్రతిష్ట మూట కట్టుకుందన్న చంద్రబాబు మనకంటే చిన్న రాష్ట్రమైన అస్సాం కేంద్రం నుంచి 34 వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చుకుందని, దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లక్ష కోట్ల నిధులు తెచ్చుకుందని వివరించారు. జగన్ పాలనలో కేవలం 2016 కోట్ల రూపాయలు మాత్రమే తెచ్చుకుందని, ఇంతకంటే సిగ్గుచేటు ఏముందన్నారు.

చంద్రబాబు ప్రసంగం మొత్తం కూటమి పాలనలో చేసిన అభివృద్ధి, జగన్ హయాంలో జరిగిన విధ్వంసంపైనే సాగింది. మొన్న అనంత్ అంబానీని తీసుకొచ్చి మదనపల్లిలో హార్టీ కల్చర్ హబ్ ను ప్రారంభించడం, నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చి జల్ జీవన్ మిషన్ ను ప్రారంభించడంతో కడప ప్రజల్లో ఉత్సాహం కనిపించింది. ప్రభుత్వం ఇదే స్పీడ్ లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తే కడప నెంబర్ వన్ స్థానంలోకి చేరడం ఖాయమని స్థానికులు చెప్పుకోవడం కనిపించింది.