మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ గర్భ గుడిలోకి ప్రవేశించే విషయంలో ఎమ్మెల్యే కూతురికి, మహిళా ఎస్సైకి మధ్య వాగ్వివాదం జరగడం, ఒకరిమీద మరొకరు దాడి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కర్ణాటకలోని శ్రీ రంగ పట్నంలో గల ఆరతి ఉక్కడ ఆలయంలో భీమ అమావాస్య వేడుకలలో పాల్గొనేందుకు బీజేపీ కి చెందిన తమకూరు రూరల్ ఎమ్మెల్యే బీ. ఎస్. సురేష్ గౌడ కూతురు ఐశ్వర్య వెళ్లారు. గర్భ గుడి ప్రవేశ మార్గంలో మాండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై సావితా పాటిల్ బందోబస్త్ లో విధులు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో రద్దీ ఎక్కువగా వుంది. దీంతో నేరుగా గర్భగుడిలోకి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్న ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్యకు కాసేపు వెయిట్ చేయమని చెప్పారు.

నేను ఎమ్మెల్యే కూతురిని, నన్నే అడ్డుకుంటావా అంటూ ఐశ్వర్య రెచ్చిపోయారు. ఈ విషయంలో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగడంతో ఒకరి మీద మరొకరు దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య ఎస్సై సవిత చెంప మీద కొట్టడంతో ఆగ్రహానికి గురైన ఎస్సై తిరిగి కొట్టింది. అక్కడ వున్న భక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

విధుల్లో వున్న తనను అనవసరంగా దుషించడమే కాకుండా చెంప దెబ్బ కొట్టినట్లు ఎస్సై సవిత పాటిల్ కైతనహళ్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విషయంలో ఎమ్మెల్యే సురేష్ గౌడ స్పందించారు. తన కూతురిని గర్భ గుడిలోకి అనుమతించకుండా ఒక సీఐ ని అనుమతించారని, దీన్ని ప్రశ్నించిన తన కూతురు ఐశ్వర్యను దుషించారని ఆరోపించారు. దీంతో ఘర్షణ జరిగిందని చెప్పారు.

ఒక ఎమ్మెల్యే కూతురినని చెప్పినప్పటికి ఎస్సై లెక్క చేయలేదని, ఇది ఎంత మాత్రం సమర్ధనీయం కాదన్నారు. ఆగస్టు 12 వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే కూతురు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించక పోవడం గమనార్హం. అయితే దేవుడి ఆలయంలో రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువై పోయిందని, దీన్ని నిలువరించాలని భక్తులు కోరుతున్నారు.