వైసీపీ… ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు వినిపిస్తుండగా.. మరింత లోతుగా పార్టీ అధ్యయనం చేస్తోంది. ఒకప్పుడు 4 కీలక అంశాల ఆధారంగా వైసీపీ ప్రజలకు చేరువ అయింది. అయితే.. వాటిలో మూడు అంశాలు తుడిచి పెట్టుకుపోగా.. ఇప్పుడు కేవలం ఒకే ఒక్క అంశం మిగిలింది. ఈ ఒక్కటే పార్టీకి దశ-దిశ.. అన్నట్టుగా ఉంది. అయితే.. ఇది కూడా పోయే ప్రమాదం ఏర్పడుతోందన్నది పార్టీలో నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
ఇవీ 3 పిల్లర్లు..
- సంక్షేమం: వైసీపీకి ఆది నుంచి కూడా సంక్షేమ పార్టీగానే ముద్ర పడింది. 2019కి ముందు.. మాజీ సీఎం తనయుడిగా ఒక్క ఛాన్స్ అంటూ.. జగన్ ప్రజలను మురిపించి ప్రభుత్వంలోకి వచ్చారు. ఆ తర్వాత.. తన సర్కారపై ఆయన సంక్షేమ ముద్ర వేసుకున్నారు. కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడమంటూ.. సంక్షేమానికి, మేనిఫెస్టోకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, ఇప్పుడు కూటమి సర్కారు కూడా ఇదే పాటిస్తోంది. పైగా జగన్ కంటే కూడా.. ఎక్కువ గానే సంక్షేమాన్ని అమలు చేస్తోంది. దీంతో సంక్షేమం అనే పిల్లర్ వైసీపీ నుంచి దాదాపు పోయింది.
- సామాజిక వర్గాలు: వైసీపీకి మరో ప్రాణాధారమైన విషయం..సామాజిక వర్గాలు. 2019కి ముందు.. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ వర్గాలు వైసీపీకి అండగా ఉన్నాయి. దీంతో అప్పట్లో అధికారంలోకి వచ్చేశారు. కానీ, తర్వాత.. కాలంలో రెడ్డి నాయకులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసినా.. వారిలో 50 శాతం మంది మాత్రమే వైసీపీ వైపు నిలిచారు. ఇక, ఇప్పుడు.. పవన్ కల్యాణ్ దూకుడుతో ఎస్టీలు, టీడీపీ దూకుడుతో ఎస్సీలు, మైనారిటీలు కూడా వైసీపీకి దూరమయ్యారు. ఇక, రెడ్లు మాత్రమే వైసీపీవైపు 50 శాతం నిలిచారు. దీంతో ఈ పిల్లర్ కూడా.. దాదాపు కూలిపోయింది.
- కుటుంబం: వైసీపీకి, ముఖ్యంగా జగన్‌కు కుటుంబ రాజకీయాలు కలిసి వచ్చాయి. మాతృమూర్తి విజయమ్మ సహా సోదరి షర్మిలలు.. 2019 ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కుటుంబంలో చీలికలు పేలికలు అయ్యాయి. దీంతో కుటుంబం అనే బలమైన పిల్లర్ జగన్‌కు దూరమైంది. ఫలితంగా.. ఈ విషయంలోనూ ఆయన మైనస్ అయ్యారు.
ఉన్నది ఒక్కటే..!
4) ఇమేజ్: జగన్‌కు ఉన్న మాస్ ఇమేజ్ ఒక్కటి మాత్రమే ఇప్పుడు బలంగా ఉంది. ఆయన పార్టీ ఓడిపోయి.. అధికారం కోల్పోయినా.. ఈ ఇమేజ్ ఒక్కటే ఉంది. అయితే.. దీనిని కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నా.. ఆయన చేస్తున్న ప్రకటనలు.. వేస్తున్న అడుగులు.. దీనిని నిలబెడతాయా? లేదా? అనేది ముఖ్యం. సో.. ఈ ఒక్కటి కూడా.. కూలిపోతే.. వైసీపీ ఆది నుంచి రాజకీయాలు ప్రారంభించక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
