తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ టాక్. జెర్సి, ఆకాశం నీ హద్దురా తరహాలో ఎప్పటికి చెప్పుకునే మూవీ అవుతుందని రషెష్ చూసినవాళ్ల మాట. మొదటి వారంలో రామాయణ, స్క్రీన్, మహాశక్తి లాంటివి ఉండటంతో హ్యాపీగా థర్డ్ వీక్ ఎంచుకున్నారు.

అయితే సరిగ్గా అదే నవంబర్ 20 ఓమ్ విడుదలవుతోంది. ఇందులో ధనుష్ హీరో అయినప్పటికీ మమ్ముట్టి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లు. విచిత్రం ఏమిటంటే తండ్రి కొడుకుల ఈ రెండు సినిమాలు మలయాళంలో రూపొందటం లేదు. ఆకాశంలో ఒక తార తెలుగు, ఓమ్ తమిళంలో తీస్తున్నారు. మల్లువుడ్ కు మాత్రం రెండూ డబ్బింగ్ రూపంలోనే వెళ్తాయి.

ఇలా తండ్రి కొడుకుల వేర్వేరు సినిమాలు ఒకే రోజు తలపడటం గతంలో జరగలేదని చెప్పాలి. ఎన్టీఆర్ – బాలకృష్ణ, ఏఎన్ఆర్ – నాగార్జున, చిరంజీవి – రామ్ చరణ్, నాగార్జున – నాగచైతన్య ఇలా ఎవరూ పరస్పరం ఢీ.కొట్టలేదు. పరస్పరం కలిసి నటించారు తప్పించి కాంపిటీషన్ కు పోలేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆకాశంలో ఒక తార, ఓమ్ రెండూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాదు. ఒకరకంగా చెప్పాలంటే బలమైన కాన్సెప్ట్ సందేశం ఉన్నవి.

దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐ యాం గేమ్ తీవ్రంగా నిరాశ పరచడంతో మళ్ళీ కంబ్యాక్ అవ్వాలంటే ఆకాశంలో ఒక తారతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నాడు. తెలుగులోనే చేసిన మరో సినిమా శ్రీశ్రీ డిసెంబర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇంత తక్కువ గ్యాప్ లో వరసగా సినిమాలు రిలీజ్ చేసుకోవడం దుల్కర్ అదే పనిగా ప్లాన్ చేసుకున్నది కాకపోయినా తనకు బ్లాక్ బస్టర్లు ఇస్తున్న మార్కెట్ గా టాలీవుడ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది.