సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు కాకినాడలో పార్టీ వైఖరిని చూచాయగా ప్రకటించారు. ఇప్పుడు సాధిక్ ఖాన్ అనే నేరస్తుడు చేసిన నేరాన్ని ప్రస్తావిస్తూ రాజకీయాలు మొదలుపెట్టారు. మొత్తానికి విజయసాయి రెడ్డి ఏమి చెబుతున్నారంటే…

కాకినాడ జిల్లా రావులపాలెం లో సోమవారం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిఠాపురం పంచాయతీ రాజ్ ఏఈ బెల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాధిక్ ఖాన్ పాత్ర గురించి పలు ఆరోపణలు చేశారు. ఒకవైపు సాధిక్ కరుడుగట్టిన నేరస్తుడు అని చెబుతూనే మరోవైపు అతడు లవ్ జిహాద్ కు పాల్పడినట్లు విమర్శలు చేశారు.

నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నిందితుడిని కఠినంగా శిక్షించడానికి వీళ్ళు ముందుకు రావడం లేదన్న విజయసాయి అసలు లవ్ జిహాద్ గురించి వారి అభిప్రాయాలూ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, జగన్ హిందువులకు ద్రోహం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఇలాంటి వారికి యూపీ తరహా ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

నూకరాజు ఆత్మహత్య కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించారు. నిందితుడు సాదిక్ పరారీలో ఉండటంతో 40 మంది పోలీసులతో 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సాదిక్ మీద హత్యకేసు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, బ్లాక్ మెయిల్, బలవంతపు మత మార్పిడి వేధింపుల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు విదేశాలకు పారిపోకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కాల్ డేటా సహాయంతో ఢిల్లీలోని ఒక లాడ్జిలో వున్న సాదిక్ ను పట్టుకున్నారు. కాకినాడకు తీసుకొని వచ్చి 8 మంది సీఐ ల బృందం సాదిక్ ను విచారించింది.

ముఖ్యమంత్రి గా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు తన పాలనలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చేశారు. అన్నీ మతాలను, మత విశ్వాసాలను గౌరవించారు. ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో కూడా ఆయన ఆఘమేఘాల మీద స్పందించారు. నిందితుడి చుట్టూ పోలీసులను మోహరించారు. స్వల్ప కాలంలోనే నిందితుడిని అరెస్టు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించడం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన ఆంధ్ర ప్రదేశ్లో హిందూ ముస్లింల మధ్య సామ
రస్యం వుంది. ఇక్కడి ప్రజలు మత విశ్వాసాల కంటే అభివృద్ధికే మొగ్గు చూపుతారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మత పరంగా విడిపోయారు.

రాజకీయ, పరిపాలన పరంగా కూడా అది కనిపిస్తుంది. ఏపీ లో యూపీ తరహా రాజకీయాలను ప్రజలు అంగీకరించరు. విజయసాయి మత రాజకీయాల ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేరో మైండ్ రాజకీయ నాయకులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మొగ్గు చూపారన్నది విశ్లేషకుల అభిప్రాయం.