విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి రోడ్డులో చితక్కొట్టుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖ ఉలిక్కి పడింది. పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

విశాఖపట్నం మధురవాడలోని మారి వలస, తిమ్మాపురం రోడ్డు, శివశక్తి నగర్ ప్రాంతంలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ముగ్గురు మేజర్లు, ముగ్గురు మైనర్ విద్యార్థులతో సహా పెద్ద సంఖ్యలో తలపడ్డారు. పిడి గుద్దులు, ముష్టిఘాతాలతో ఒకరి మీద మరొకరు దాడులు చేసుకున్నారు.

వీరంతా శివశక్తి నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పట్టపగలు కొట్టుకుంటున్న విద్యార్థులను నిలువరించేందుకు స్థానికులు ప్రయత్నించినా ఆగలేదు. క్రమంలో బైకు మీద వెళుతున్న ఒక వ్యక్తితో గొడవకు దిగిన గ్యాంగ్ అతడి మీద కూడా దాడి చేసినట్లు తెలుస్తుంది. అర్ధగంట కొనసాగిన ఈ గ్యాంగ్ వార్లో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఈ వీధి పోరాటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

రెండు రోజులుగా ఈ ఘర్షణలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. చంద్రపాలెం పాఠశాల వద్ద ఈ గొడవ మొదలైనట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు కొట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ గ్యాంగ్ వార్ ను సీరియస్ గా తీసుకున్న విశాఖ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో వున్నట్లు గుర్తించారు. వారికోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. ఘటనకు సంబందించి 6 కేసులు నమోదు చేశారు.

గ్యాంగ్ వార్లో పాల్గొన్న విద్యార్థులు మద్యం మత్తులో వున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిషాలో ఉండటంతో రోడ్డున పోయే వారితో సైతం గొడవకు దిగారని, గొడవ జరగకుండా ఆపాలని ప్రయత్నం చేసిన వారి మీద కూడా దాడికి దిగారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులను విచారించిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో గంజాయి ప్రభావం ఎక్కువగా వున్నట్లు నివేదికలు వస్తున్న సమయంలో ఈ గ్యాంగ్ వార్ జరగడంతో విద్యార్థులు గంజాయి సేవించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.