వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మరికొందరు నిందితులున్నార‌ని, వారి ఫోన్లను పరిశీలించి మరింత లోతుగా విచారణ జరపాలని సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. సునీత చెప్పిన నిందితులందరినీ సమగ్ర విచారణ పూర్తయిందని సీబీఐ చెబుతోంది. సునీత పేర్కొన్ని నిందితులకు వివేకా హ‌త్య‌తో సంబంధం లేద‌ని సీబీఐ అధికారులు కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు.

దీంతో, తాను చెప్పిన నిందితులను మరింత లోతుగా విచారణ జరపాలని సునీత వేసిన పిటిషన్ విచార‌ణ‌ను పొడిగించలేమని పేర్కొంటూ సునీత పిటిష‌న్ ను నాంపల్లి కోర్టు రద్దు చేసింది. దీంతో, సునీత తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఈ కేసులో సునీత పోరాటం ముగిసిపోయిందన్న భావన వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డితో పాటు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది.

వివేకా కేసులో సీబీఐ విచారణ ఆధారంగా ఈడి మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. వివేకా మర్డర్ కేసులో రాజకీయ నేతల ప్రమేయంతో పాటు మనీలాండరింగ్ కోణంలో కూడా ఈడీ కూపీ లాగింది. వివేకా హత్య జరగడానికి ముందు 4 కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, కడప, పులివెందుల..ఇలా మొత్తం ఆరు చోట్ల ఈడి సోదాలు చేపట్టింది. హైదరాబాద్లోని కోకాపేట్ లో ఉన్న అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ జోనల్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.