జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. సజ్జల వల్ల సాయిరెడ్డి వైసీపీనీ వీడి సొంత పార్టీ పెట్టబోతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. అయితే, సజ్జల తనను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా జగన్ వారించలేదని సాయిరెడ్డి ఓపెన్ గా చెప్పారు. ఇలా సజ్జలపై సంచలన ఆరోపణలు చేస్తున్న సాయిరెడ్డి…తాజాగా మరోసారి సజ్జల, జగన్ లను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగినా సహించానని, కానీ, రెండు విషయాల్లో మాత్రం తన ఆత్మ గౌరవం దెబ్బతినడంతోనే పార్టీని వీడానని సాయిరెడ్డి చెప్పారు.

తన అపాయింట్మెంట్లు సాయిరెడ్డి చూడరని, సీఎస్ జవహర్ రెడ్డి చూస్తారని ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలకు జగన్ చెప్పడంతో బాగా హర్ట్ అయ్యానని సాయిరెడ్డి అన్నారు. ఇక, ఢిల్లీలో పార్టీ పనులు చక్కబెడుతున్న తనను తీసుకువచ్చి రీజనల్ కో ఆర్డినేటర్ గా సకల శాఖా మంత్రి సజ్జల ప్రోత్బలంతో జగన్ నియమించడాన్ని జీర్ణించుకోలేకపోయానని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయని, కానీ, ముఖ్యంగా ఈ రెండు కారణాలతోనే తాను పార్టీకి గుడ్ బై చెప్పానని, తనకు కూడా ఆత్మ గౌరవం ఉందని అన్నారు.

ఒకవేళ జగన్ పిలిస్తే మళ్లీ వైసీపీలోకి వెళ్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సాయిరెడ్డి ఆసక్తికర సమాధానమిచ్చారు. పార్టీ నుంచి వెళ్లిన వారిని పిలిచే మనస్తత్వం జగన్ ది కాదని, అలా పిలిచినా వెళ్లే మనస్తత్వం తనది కాదని అన్నారు. అంటే, జగన్ పిలవరు…నేను వెళ్లను అని చెప్పారు.

ఇక, బీసీ రిజర్వేషన్లపై టీడీపీ, వైసీపీల తీరును సాయిరెడ్డి తప్పుబట్టారు. ఈ రెండు పార్టీలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంలో తీవ్రంగా నాటకాలాడుతున్నాయని విమర్శించారు. బీసీలకు అన్యాయం చేస్తూ వారి ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూడటం సరికాదని హితవు పలికారు. 50 శాతం పరిమితిని దాటితే సుప్రీ కోర్టు ఒప్పుకోదని తెలిసినా సరే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలు ఇవ్వడం, ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయించడం ఈ రెండు పార్టీలకు పరిపాటిగా మారిందని విమర్శించారు.

అసలు, స్థానిక సంస్థల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, కనీస నిధులు, తగిన అధికారాలు లేని పంచాయతీలు, మున్సిపాలిటీలకు రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని సాయిరెడ్డి ఆరోపించారు. ఈ మోసపూరిత రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని, ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.