పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నాందేడ్ లోని గురుద్వారాలో సుఖ్ బీర్ సింగ్ పై కత్తితో దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ దాడిలో సుఖ్ బీర్ సింగ్ కుడి చేతికి గాయమైంది. ఆయనతోపాటు భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. సుఖ్ బీర్ ను హుటాహుటీన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక నిహంగ్ సిక్కు ఈ దాడి చేశాడని, అతడిని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
తన భార్య, అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, కుటుంబ సభ్యులతో కలిసి నాందేడ్‌లోని ప్రసిద్ధ ‘తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్’ గురుద్వారాను సుఖ్ బీర్ సందర్శించారు. దర్శనం అనంతరం ఈ దాడి జరిగింది. త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ఏడీ, బీజేపీల మధ్య పొత్తు పొడవబోతోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రధాని మోడీతో సుఖ్ బీర్ కొద్ది రోజుల క్రితం భేటీ, డీలిమిటేషన్ ప్రక్రియకు బాదల్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడి జరగడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. గతంలో ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన ఎస్ఏడీ…సాగు చట్టాల వివాదం వల్ల కూటమి నుంచి బయటకు వచ్చింది.
బాదల్ పై దాడి జరగడం ఇది రెండోసారి. 2024లో అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం దగ్గర బాదల్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. గురి తప్పి బుల్లెట్ పక్కకు వెళ్లడంతో ఆ ఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తనయుడైన సుఖ్ బీర్ 2009-17 కాలంలో వరుసగా రెండుసార్లు పంజాబ్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates