రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్ సేన శుద్ధి చేయడం వివాదాస్పదంగా మారింది. రాజకీయ ర్యాలీ విషయంలో ఒక మత సంస్థ జోక్యం చేసుకోవడమే కాకుండా అవాంఛనీయంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుశ్చర్య ను కేంద్ర ప్రభుత్వం కూడా ఖండించింది.
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానిలో గల రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ అనంతరం జరిగిన సభలో పేపర్ లీక్స్, క్షీణించిన శాంతి భద్రతలు, రైతుల సమస్యలపై మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ర్యాలీ ముగిసిన తర్వాత శ్రీరాం సేన రంగ ప్రవేశం చేసింది. ఖర్గే ర్యాలీతో రాంలీలా మైదానం అపవిత్రం అయిందంటూ శుద్ధి కార్యక్రమం చేపట్టింది. రాంలీలా మైదానంలో వివిధ రాజకీయ పార్టీలు సభలు, ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే దళిత నేతగా పేరొందిన ఖర్గే పాల్గొన్న ర్యాలీని శుద్ధి చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే లేవనెత్తారు.
ఈ దేశంలో దళితులకు చోటు లేదని మరోసారి రుజువైందని ధ్వజామెత్తారు. రాంలీలా మైదానంలో అన్నీ పార్టీలు సభలు, ర్యాలీలు నిర్వహిస్తుంటాయని, ఇప్పుడు మాత్రమే మైదానం అపవిత్రం అయిందని చెప్పడం దారుణం అన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రజల్ని విభజిస్తుందని మండిపడ్డారు. రాంలీలా మైదానంలో తాను కేవలం రాజకీయ ప్రసంగం మాత్రమే చేశానని, ఏ కులాన్ని, మతాన్ని ప్రస్థావించలేదని గుర్తు చేశారు. దీని మీద రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి.
అసలే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరడంలేదు. రాజ్యసభలో ఈ అంశం వివాదమైతే ప్రభుత్వానికి తలనొప్పిగా మారడం గ్యారంటీ. అందుకే బీజేపీ వెంటనే ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. శుద్ధి కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తల ప్రమేయం లేదని కేంద్ర మంత్రి నడ్డా ఖండించారు. ఈ ఘటన మీద విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఖర్గే చల్లబడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates