వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు దారి తీశాయి. తనను మానసికంగా వేధించారని.. అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా తనపై నాలుగు సార్లు హత్యాయత్నం కూడా చేశారని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఆరోపించడం సంచలనంగా మారింది.
ఇప్పటికే గత నాలుగు రోజులుగా సాగుతున్న ఎపిసోడ్‌లో మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి కుటుంబంపై గృహహింస కేసు పెట్టారు. దీనిలో రమేష్, ఆయన సతీమణి, రాజీవ్ సహా.. ఇతరులను కూడా చేర్చినట్టు పోలీసులు తెలిపారు. గత 2025లో రాజీవ్, మేఘనలకు వైభవంగా వివాహం జరిగింది. ఇంతలోనే ఏడాది కాలంలో వివాదం చోటు చేసుకోవడం.. ఏకంగా తనపై నాలుగు సార్లు హత్యాయత్నం చేశారని ఆమె ఆరోపించడం సంచలనంగా మారాయి.
ఇక, తాజాగా జోగి రమేష్ కుటుంబం పరారయ్యిందన్నవార్త వెలుగు చూసింది. ప్రస్తుతం పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిసింది. అయితే.. బయటకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కుటుంబ వ్యవహారం కావడం.. ఉన్నతస్థాయి రాజకీయ కుటుంబం కావడంతో పోలీసులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా ఇంటికి తాళం ఉందని .. గేటుకు నోటీసులు తగిలించామని పేర్కొన్నారు.
వైసీపీకి ఉక్కపోత!
ఇదిలావుంటే.. వైసీపీ తరఫున ఎవరూ ఈ విషయంపై మాట్లాకపోవడం గమనార్హం. ఇక, ఈ నెలలోనే ఫ్యామిలీ సొంత వివాదాలతో నాయకులు ఇరుకున పడడం కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. శ్రీకాకుళం జిల్లా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ ప్రమాదం చేసిన ఘటనలో సాక్ష్యాలను తప్పించబోయి.. సీదిరి జైలుకు వెళ్లారు. ఇక, శవం డోర్ డెలివరీ కేసులో.. ఎమ్మెల్సీ అనంతబాబు సహా ఆయన సతీమణి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక, తాజాగా జోగి వ్యవహారంలో మొత్తం కుటుంబం అంతా చిక్కుకుంది. ఇలా.. వైసీపీకి అన్ని వైపుల నుంచి ఇబ్బందులు రావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
