ప్రధాని మోడీకి కాక్రోచ్ సెగ తగులుతుందా?

దేశ రాజ‌ధాని ఢిల్లీ ప‌రిణామాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశానికి ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఏక్ష‌ణంలో ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డుతుందోనన్న ఉత్కంఠ తెర‌మీదికి వ‌చ్చింది.

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతున్న స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్షాల కంటే కూడా.. ఉద్య‌మ సంస్థ‌గా ఆవిర్భ‌వించిన‌ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నుంచి భారీ ఎత్తున సెగ త‌గులుతోంది. నీట్ ప‌రీక్ష‌లో అవ‌క‌త‌వ‌క‌లు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌న్న ప‌లు డిమాండ్ల‌తో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన దేశ‌వ్యాప్త ఉద్య‌మం.. తాజాగా మ‌రోసారి సెగ పెంచుతోంది. వాస్త‌వానికి గ‌త 21 రోజులుగా ఇవే డిమాండ్ల‌తో ప్ర‌ముఖ ఉద్య‌మ కారుడు సోన‌మ్ వాంగ్ చుక్ ఉద్య‌మిస్తున్నారు.

ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు కూర్చున్నారు. అయితే.. శ‌నివారం తెల్ల‌వారుజామున సోన‌మ్ దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. ఆయ‌న‌ను అరెస్టు చేసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీంతో ఇక కాక్రోచ్ పార్టీ పెట్టేబేడా స‌ర్దుకుంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావించి ఉంటుంది. కానీ, అనూహ్యంగా ఇక్క‌డే యూట‌ర్న్ తీసుకుంది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే.. శనివారం ఉద‌యం 9 గంట‌ల నుంచి ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. సోన‌మ్ వాంగ్ చుక్ దీక్ష‌కు కూర్చున్న చోటే ఆయ‌న కూడా దీక్ష చేప‌ట్టారు.

త‌మ ఉద్య‌మం ఆగ‌బోద‌ని దీప్కే ప్ర‌క‌టించారు. త‌మ‌పై బ‌ల‌ప్ర‌యోగం చేస్తే.. దేశ‌వ్యాప్తంగా యువ‌త‌, నిరుద్యోగులు ఉద్య‌మిస్తార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వం తాను చేయాల్సిన విహిత క‌ర్త‌వ్యాన్ని విస్మ‌రించింద‌ని దీప్కే విమ‌ర్శించారు. ఆయ‌న దీక్ష చేప‌ట్టిన అర‌గంట‌లోనే.. దేశ‌వ్యాప్తంగా ఈ వార్త విస్త‌రించింది. దీంతో నిరుద్యోగులు.. ప‌లు విప‌క్షాల నాయకులు కూడా దీప్కేకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. పంజాబ్‌, హ‌రియాణ‌(ఢిల్లీకి చేరువగా ఉన్న రాష్ట్రాలు) నుంచి యువ‌త ఢిల్లీ బాట ప‌ట్టారు.

దీంతో వ్య‌వ‌హారం ముదురుతోంద‌ని గ్ర‌హించిన కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఆ వెంట‌నే అత్యవ‌సర స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పిలుపునిచ్చారు. స‌మీపంలో ఉన్న మంత్రుల‌ను త‌క్ష‌ణే రావాల‌ని ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం నుంచి వారికి సందేశాలు వెళ్లిన‌ట్టు తెలిసింది. పార్ల‌మెంటు ప్రారంభం అవుతుండ‌డం.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఉద్య‌మం తీవ్ర‌త‌రం అవుతున్న నేప‌థ్యంలో మోడీ ఇప్పుడు అప్ర‌మ‌త్తం కావ‌డం వెనుక కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. త‌క్ష‌ణమే కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో రాజీనామా చేయించే అవ‌కాశం ఉంద‌ని జాతీయ మీడియాలో వార్తలు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.