ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు… ఇప్పుడెలా ‘సర్’?

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణకుమారి పేరు గుంటూరు నగర ఓటరు జాబితాలో కనిపించకపోవడంతో ఆమె అధికారులను ఆశ్రయించారు. ఒక మాజీ మంత్రి ఓటే లేకపోతే సామాన్య ఓటర్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఓటరు జాబితాలో తన పేరు లేదని ఎన్నికల అధికారులు చెప్పడంతో అరుణకుమారి ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన ఓటును పునరుద్ధరించాలని కోరారు.

డాక్టర్ శనక్కాయల అరుణకుమారి 1999 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రెండో మంత్రివర్గంలో ఆమెకు మంత్రి పదవి దక్కింది.

ఇదిలా ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. ఇంటింటి సర్వే, డిజిటలైజేషన్ ప్రక్రియకు జూలై 14 చివరి గడువుగా నిర్ణయించారు. మరణించినవారు, వేరే ప్రాంతాలకు వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రక్రియ లక్ష్యం.

చివరి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అధికారులు సవరణ పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రజలు హెల్ప్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి ఓటు గల్లంతు కావడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.