జనసేన పార్టీ మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. వీర మహిళలు అని సంబోధిస్తూ పార్టీలో మహిళలకు జనసేన అధినేత పవన్ అత్యంత గౌరవమిస్తారన్న సంగతి తెలిసిందే. పార్టీ సిద్ధాంతాన్ని జనసేన నేతలు కూడా తూ.చ తప్పుకుండా పాటిస్తుంటారు. తాజాగా కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన తీరును జనసేన తెలంగాణ జనరల్ సెక్రటరీ, నిర్మాత రామ్ తాళ్లూరి ఖండించిన తీరు అందుకు నిదర్శనం.
ఇడుపు కాగితం సినిమా పేరుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవితపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అయితే, ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులకు స్థలాలు కేటాయించాలంటూ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోడుప్పల్ లో నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే కవితను మహిళా పోలీసులు బలవంతంగా నిరసన నుంచి లాక్కొని వెళ్లారు. పోలీసులను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ క్రమంలో మహిళా పోలీసులతోపాటు కవిత కూడా కిందపడిపోయారు.
ఆ తర్వాత కవితను అరెస్టు చేసి బలవంతంగా పోలీసులు జీపులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్టు చేసిన విధానాన్ని జనసేన తరఫున రామ్ తాళ్లూరి తీవ్రంగా ఖండించారు. మహిళా నాయకురాలు కవిత పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయంగా కవితతో విభేదాలు ఉండొచ్చని, విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అని చెప్పారు. కానీ, ఇటువంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ తమకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. మహిళా నాయకుల హక్కులు, గౌరవానికి భంగం కలగకుండా గౌరవప్రదంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు రామ్ విజ్ఞప్తి చేశారు. రామ్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
