తిరుచ్చిలో పోటీపై లారెన్స్ క్లారిటీ

తమిళనాట పార్టీ పెట్టిన మూడేళ్లలోపే అనూహ్యంగా అధికారంలోకి వచ్చేశారు తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్. మూడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. సీఎం అయ్యాక పెరంబూర్‌ స్థానాన్ని నిలుపుకుని, తిరుచ్చి నియోజకవర్గం నుంచి రాజీనామా చేశారు. ఇక్కడ ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఐతే ఇక్కడ టీవీకే తరఫున ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతారన్నది సస్పెన్సుగా మారింది.

మొదట్లో త్రిష పేరు వినిపించింది. తర్వాత విజయ్‌కి సన్నిహితులైన కొందరు టీవీకే నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్లందరినీ కాక డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ను విజయ్ తిరుచ్చి నుంచి పోటీ చేయిస్తారంటూ ఒక ప్రచారం మొదలైంది. లారెన్స్ దీని గురించి కొన్ని కామెంట్లు చేయడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. లారెన్స్ తిరుచ్చి టీవీకే అభ్యర్థి అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. లారెన్స్ అభిమానులు కొంత హంగాామా కూాడా చేశారు.

ఐతే ఇప్పుడు లారెన్స్ తిరుచ్చి నుంచి పోటీ చేసే విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశాడు. తిరుచ్చిలో పోటీ చేయాలంటే ఒక అర్హత ఉండాలని.. అందుకు తాను తగిన వాడిని కాదని లారెన్స్ స్పష్టం చేశాడు. ఒకరు ఒక మొక్కను నాటి, దానికి నీళ్లు పోసి, ఎరువు వేసి, కాపలా కాసి చెట్టును పెంచితే.. అందులోని పళ్లను తాను కోసుకుని ఎలా తింటానని లారెన్స్ ప్రశ్నించాడు.

విజయ్‌కి ఎన్నో ఏళ్ల నుంచి అండగా ఉంటున్న వాళ్లు.. టీవీకే పార్టీ కోసం కొన్నేళ్ల నుంచి కష్టపడ్డ వాళ్లలో ఎవరైనా ఆ స్థానం నుంచి పోటీ చేయాలి తప్ప.. ఉన్నట్లుండి తాను ముందుకొచ్చి తిరుచ్చి స్థానంలో పోటీ చేయడం న్యాయం కాదని లారెన్స్ అభిప్రాయపడ్డాడు.

తిరుచ్చి నుంచి ఎవరిని పోటీ చేయించాలో విజయ్ నిర్ణయం తీసుకుని ఉంటారని.. దాన్ని అందరూ గౌరవించాలని తన అభిమానులను ఉద్దేశించి లారెన్స్ వ్యాఖ్యానించాడు. తాను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వారికి కృతజ్ఞుడినని.. కచ్చితంగా వస్తానని.. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తానని.. ఎక్కడ, ఏ పార్టీ తరఫున అన్నది తర్వాత వెల్లడిస్తానని లారెన్స్ చెప్పాడు. తాను చేసే సామాజిక సేవా కార్యక్రమాల కోసం మాత్రం సీఎం విజయ్‌ని సాయం కోరుతానని.. తిరుచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని మాత్రం అడగనని లారెన్స్ స్పష్టం చేశాడు.