వైసీపీకి అమరావతిలో నో ఎంట్రీ?

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో శనివారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు… రాజధానిలోకి వైసీపీ నేతల ఎంట్రీని దాదాపుగా నిలిపివేసిందనే చెప్పాలి. అమరావతిని రాజధానిగా గుర్తించడానికే ఇష్టపడని వైసీపీ నేతలకు అమరావతితో ఏం పని అన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఆదివారం సమావేశమై… రాజధానిలోకి వైసీపీ ఎంట్రీని కఠినతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించిన తర్వాతే వైసీపీ నేతలు అమరావతిలోకి రావాలని… అలా కాకుండా వస్తే మాత్రం ఏ వైపు నుంచి వచ్చిన వైసీపీ నేతలను అమరావతిలోకి అడుగుపెట్టనివ్వబోమని వారు తేల్చి చెప్పారు.

శనివారం ఉదయం అమరావతి పర్యటనకు బయలుదేరిన వైసీపీ కీలక నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ తదితరులను రాజధాని రైతులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గంటల తరబడి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా… ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు, కోడిగుడ్ల దాడులు జరిగాయి. అందులో బాగంగానే ఓ కానిస్టేబుల్ కూ గాయలయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజదాని రైతులు, టీడీపీ స్థానిక నేతలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాజాగా ఆదివారం ఉదయం అమరావతి రైతులు… మంగళగిరి పరిదిలోని పెనుమాకలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఘటనలను వారు ఓ సారి సమీక్షించారు. అమరావతిని రాజధానిగా ఒప్పుకోని వైసీపీ… తన ఐదేళ్ల పాలనలో అమరావతిని అంధకారంలో ముంచేసిందని రైతులంతా ముక్త కంఠంతో నినదించారు. కేవలం రాజధానిపై వైఖరి కారణంగానే వైసీపీకి ఘోర పరాజయం దక్కినా…ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని వారు వాపోయారు. నాడు మూడు రాజధానులు అన్న వైసీపీ… నేడు అమరావతిని మరోమారు ముంచేందుకే మావిగన్ నినాదాన్ని అందుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాడైనా, నేడైనా… అమరావతిని ఏపీకి రాజదానిగా అంగీకరించని వైసీపీ నేతలకు అమరావతితో పనేముందని కూడా రైతుల్లో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా వద్దన్న నేతలను ఇక్కడికి అడుగు పెట్టనిచ్చేది లేదని కూడా వారు తేల్చి చెప్పారు. సమావేశంలో భాగంగా రాజకీయ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్న రైతులు… అమరావతిని ఏపీకి రాజదానిగా వైసీపీ అంగీకరిస్తే.. ఆ మేరకు ఓ విస్పష్ట ప్రకటన చేస్తే తప్పించి..ఆ పార్టీ నేతలను అమరావతిలోకి అడుగు పెట్టనివ్వరాదని వారు ఏకగ్రీవంగా తీర్మానించారు. వెరసి అమరావతిలో అడుగుపెట్టాలంటే… ముందుగా అమరావతికి తాము అనుకూలమని వైసీపీ తీర్మానం చేయాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది. అప్పటిదాకా అమరావతిలోకి వైసీపీ నేతల ఎంట్రీ దుస్సాధ్యమేనని చెప్పక తప్పదు.