హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తన సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’లో స్పందిస్తూ.. “హైదరాబాద్‌లో కొత్తగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవించబడిన తొలి అమెరికా అధ్యక్షుడిని నేనే. ఈ గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఫ్రీడం–250’ వేడుకల్లో భాగంగా, హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పేరు పెట్టారు. ఈ నెల 23న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్జియో గోర్, హైదరాబాద్ అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ సమక్షంలో నామఫలకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికాలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ట్రంప్ స్వయంగా స్పందించి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates