అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. నల్లజెండాలతో గో బ్యాక్ మావిగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్లు, కోడిగుడ్లతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
అయితే, ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసు కానిస్టేబుల్ ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడిన కానిస్టేబుల్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉండవల్లిలో హై టెన్షన్ వాతావరణం ఉండడంతో అక్కడ భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? అని ఏపీ సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. రాజధాని రైతుల ఆహ్వానం ప్రకారం సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో ఉండవల్లిలో వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? అని నిలదీశారు.
ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేశారని జగన్ ఆరోపించారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? అని జగన్ ప్రశ్నించారు. రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారని, పచ్చ ముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. అయినా సరే, రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదని, వారి పక్షాన వైసీపీ నిలబడుతుందని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates