ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా, రియలైజయ్యేలా డిజైన్ చేయకపోవడంతో అవి స్క్రీన్ మీద మొక్కుబడిగా జరిగిపోవడం, ఆడియన్స్ మొబైల్ ఫోన్స్ లో బిజీ కావడం నిత్యకృత్యంగా మారింది. అయినా మందు, సిగరెట్ ఈజీగా మానేయమని చెప్పగానే మానేసే ఛాన్స్ లేదని తెలిసీ కూడా ప్రభుత్వం తమ వంతుగా ఇది కొనసాగిస్తోంది.
అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొత్తగా ఆలోచింది ఒక అడుగు ముందుకేసింది. దురలవాట్ల గురించి కాకుండా మంచి అలవాట్లను హైలైట్ చేస్తూ వీడియో ప్రకటనలు చేయించి థియేటర్లలో ప్రదర్శిస్తోంది. నూనె పదార్థాలకు వీలైనంత దూరంగా ఉంటూ, మిలెట్స్ కి ప్రాధాన్యం ఇస్తూ, ఉప్పు వాడకం గురించి అవగాహనా కలిగిస్తూ, వీలైనంత కుటుంబాలను టార్గెట్ చేసుకునే విధంగా వీటిని డిజైన్ చేయించారు. సృజనాత్మకత జోడించడంతో బాగా కనెక్ట్ అవుతున్నాయి.
ప్రధాన కేంద్రాలతో మొదలుపెట్టి మెల్లగా బిసి సెంటర్ల దాకా వీటిని తప్పనిసరి చేయబోతున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మధ్య ప్రజల ఆహార అలవాట్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. బయట తిండి, దారి తప్పుతున్న ఆహరం వల్ల చిన్న వయసులోనే అనారోగ్యం కొని తెచ్చుకుంటున్న కేసులు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల మీద ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే ఇలాంటి యాడ్స్ అవసరమే.
ఇక్కడ సక్సెస్ అయితే క్రమంగా ఇతర రాష్ట్రాల్లో కూడా వీటిని అమలు చేసే అవకాశాలు లేకపోలేదు. నేరుగా చెబితేనో, పేపర్లలో వేయిస్తేనో జనం అంత సులభంగా మారే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి థియేటర్ యాడ్స్ ద్వారా మార్పు తెచ్చే ప్రయత్నం చేయడం మంచిదే. గతంలో రాహుల్, నా రెండు గాజులు అమ్ముకున్నాను లాంటి స్మోకింగ్ యాడ్స్ ట్రోలింగ్ బారిన పడ్డాయి. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా థియేటర్లను వేదికగా ఎంచుకోవడం తెలివైన నిర్ణయమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates