మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్ లెవెల్ లో మార్కెటింగ్ చేస్తున్నారు. రిలీజ్ ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పబ్లిసిటీని పీక్స్ కు తీసుకెళ్తున్నారు. అయినా సరే బాహుబలిని వదలడం లేదు. ఏదో ఒక రూపంలో దాన్ని నిత్యం జనాలకు కనెక్ట్ చేస్తూనే ఉన్నారు. గత ఏడాది రెండు భాగాలు కలిపి ఎపిక్ పేరుతో మరోసారి వసూళ్ల వర్షం కురిపించుకున్నారు.

ఇప్పటికే ఒక యానిమేటెడ్ సిరీస్ నిర్మాణంలో ఉండగా దానికి సంబందించిన ప్రచారం ఆల్రెడీ మొదలుపెట్టారు. కథ ఇక్కడితో అయిపోలేదు. బాహుబలి ది టార్చ్ బేరర్ పేరుతో ఒక కొత్త డాక్యు సిరీస్ ని జూన్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా. ఇప్పటిదాకా చూడని మేకింగ్ ఫుటేజ్ తో పాటు ఈ ప్యాన్ ఇండియా మూవీకి చెందిన అరుదైన విశేషాలు అందులో చూపించబోతున్నారు. నిడివి తదితర వివరాలు వెల్లడించలేదు.

మూవీ లవర్స్ మాత్రం ఇంక బాహుబలిని వదిలిపెట్టవా జక్కన్నా అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటున్న అప్డేట్స్ వారణాసి గురించి. అంతే తప్ప పదేళ్ల క్రితం ఆడేసి వెళ్లిపోయిన బాహుబలి గురించి కాదు. అయినా జక్కన్న ఎందుకు ఇంతగా మాహిష్మతి సామ్రాజ్యాన్ని ప్రొజెక్టు చేస్తూనే ఉన్నారనే ప్రశ్నకు సమాధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇవి చేయడం పట్ల రాజమౌళి చొరవ కన్నా నెట్ ఫ్లిక్స్ సంస్థ చూపిస్తున్న ఆసక్తే ఎక్కువగా ఉందట.

సో టార్చ్ బేరర్ లో ఏమేం ఉంటాయో తెలుసుకోవాలంటే ఇంకో అయిదు రోజులు వేచి చూడాలి. అన్నట్టు ఇప్పటిదాకా బాహుబలి ఎపిక్ ఇండియన్ ఓటిటిలో రానే లేదు. రెండు భాగాలూ హాట్ స్టార్ తో డీల్ చేయడం వల్ల దీనికి అవకాశం లేకుండా పోయిందట. మనకా ఛాన్స్ లేదు కానీ జపాన్ ఆడియన్స్ మాత్రం ఎంచక్కా బాహుబలి బ్లు రే డిస్కుతో పాటు మేకింగ్ వీడియో డిస్కుని కొనేసుకుని రిపీట్ షోలు చూసుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం టార్చ్ బేరర్ తో సర్దుకోవాలి.