హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి థియేటర్లకు వెళ్లిపోయే పరిస్థితి లేదు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా.. సినిమా అంతంతమాత్రం అంటే జనం లైట్ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి మిడ్ రేంజ్ స్టార్లకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. క్రేజీ కంటెంట్ ఉంటే తప్ప వాళ్ల సినిమాలకు పెద్దగా ఓపెనింగ్స్ కూడా రావట్లేదు.
మారిన ప్రేక్షకుల అభిరుచి, బాక్సాఫీస్ పరిస్థితుల కారణంగా ఇటు ఓవర్సీస్ మార్కెట్.. అటు డిజిటల్ మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి. చాలామంది మిడ్ రేంజ్ స్టార్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి టైంలో సమంత చూపిస్తున్న స్టార్ పవర్ హీరోలకు గుబులు పుట్టిస్తూ ఉంటుందనడంలో సందేహం లేదు.
‘శాకుంతలం’ సినిమాతో సమంత పనైపోయిందని చాలామంది తీర్మానించేశారు. సామ్‌లో ఛార్మ్ పోయిందని.. ఆమె సినిమాను ఒకప్పట్లా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూసే పరిస్థితి లేదని చాలామంది కామెంట్లు చేశారు. కానీ తన కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’తో ఆ అభిప్రాయం తప్పని రుజువు చేసింది సామ్. ఈ సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసే ఇండస్ట్రీ జనాలు షాకయ్యారు. చాలామంది మిడ్ రేంజ్ స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో బుకింగ్స్ జోరు కనిపించింది.
ఇక ఈ చిత్రానికి మరీ గొప్ప టాకేమీ రాకపోయినా.. తొలి రోజు బలంగా నిలబడింది. శని, ఆదివారాల్లో వసూళ్లు ఇంకా పెరిగాయి. శనివారం హౌస్ ఫుల్స్‌తో రన్ కావడమే కాక.. స్క్రీన్లు, షోలు కూడా పెంచుకుంది ‘మా ఇంటి బంగారం’. ఆదివారం కూడా రన్ చాలా బాగుంది. ఈ చిత్రం యుఎస్‌లో ప్రిమియర్స్‌తోనే హాఫ్ మిలియన్ మార్కును అందుకోవడం, శనివారానికే మిలియన్ మార్కును టచ్ చేయడం అక్కడి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది.
మిడ్ రేంజ్ స్టార్లలో చాలామందికి మిలియన్ మార్క్ ఇప్పుడు పెద్ద టాస్కుగా మారిపోయింది. అలాంటి సమంత అలవోకగా ఆ క్లబ్బులోకి అడుగు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సామ్ సినిమా దూకుడు చూసి అందరూ షాకవుతున్నారు. ఒక హీరోయిన్ ఈ స్థాయిలో తన స్టార్ పవర్ చూపించడం.. హీరోల్లో గుబులు రేపుతూ ఉంటుందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates