ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి మారుతోందా? ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని చెబుతున్న జగన్‌కు.. అసలు ఈ ఛాన్సే చిక్క కుండా చేసేలా.. ఆయన స్వయంకృతాలే ఆయనను వెంటాడనున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమ మద్యం కుంభకోణం కేసు ఉరుకులు పరుగులు పెడుతోంది. ఏముంది.. అంతా అయిపోయింది.. అనుకున్న సమయంలో కేసు దూకుడు పెరిగింది.
వాస్తవానికి నాలుగు రోజుల కిందట కూడా.. వైసీపీ నాయకులు మద్యం కేసు లేదు.. ఏమీ లేదు.. అంతా బుస అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ.. రోజులు మారుతున్న కొద్దీ కేసు తీవ్రత పెరుగుతోంది. అక్రమ మద్యం కేసును సవాల్‌గా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు జగన్‌కు పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసిన కేఎన్ ఆర్ నుంచి.. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పనిచేసే అటెండర్‌మనోహర్ వరకు ఎవరినీ వదిలి పెట్టడంలేదు.
ఈ క్రమంలో కేసు ప్రభావం.. తీవ్రత.. వేగం అన్నీ పెరుగుతున్నాయి. మరోవైపు.. కేఎన్ ఆర్ ఆస్తులు.. ఆయన విదేశాలకు తరలించిన నిధులు.. దీని వెనుక ఎవరు ఉన్నారన్న విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కూపీ లాగుతున్నారు. ఇవన్నీ.. అతి పెద్ద నేత చుట్టూనే తిరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే జరిగితే.. జగన్‌కు ఉచ్చుబిగుసుకున్నట్టేనని అంటున్నారు.
పాదయాత్ర డౌటే..?
ఇక, వచ్చేఏడాది నుంచి తాను ప్రజల మధ్య ఉంటానని.. పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించారు. కానీ.. ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్న అక్రమ మద్యం కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే.. పాదయాత్రపై ఈ ప్రభావం పడే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. కేసుల తీవ్రత పెరిగితే.. ఆయనకు ప్రతిబంధకంగా మారుతుందని అంటున్నారు. ఇదే జరిగితే.. పాదయాత్ర చేయడం కూడా కష్టమేనన్న అంచనాలు వస్తున్నాయి. కోర్టులు-విచారణలతోనే జగన్‌కు సమయం సరిపోతుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
