జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు చంద్ర‌బాబు అదిరిపోయే వ్యూహం!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వ‌చ్చే ఏడాది నుంచి దాదాపు ఏడాదిన్న‌ర పాటు పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత‌.. నేరుగా ఎన్నిక‌ల‌కు రెడీ అవుతారు. పాద‌యాత్ర ద్వారా పార్టీని డెవ‌ల‌ప్ చేయాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం. త‌ద్వారా అధికారంలోకి వ‌చ్చేందుకు 2019 నాటి ప‌రిస్థితుల‌ను సృష్టించుకోవాల‌ని వ్యూహాత్మ‌కంగా ఆలోచ‌న చేశారు. అయితే.. ఎత్తుకు పై ఎత్తు అన్న‌ట్టుగా.. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు మ‌రో అదిరిపోయే వ్యూహం సిద్ధం చేశారు. జ‌గ‌న్ పాద‌యాత్ర గురించి.. తాజాగా ఆయ‌న అంత‌ర్గ‌త స‌మావేశంలో చ‌ర్చించారు.

అయితే.. ప్ర‌త్య‌ర్థులు వేసే ఎత్తుల‌కు మ‌నం పై ఎత్తులు వేయాల్సి ఉంటుంద‌ని పేర్కొన్న చంద్ర‌బాబు.. ఇప్ప‌టి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ప్ర‌తి బుధ‌వారం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేస్తామన్నారు. దాని ప్ర‌కారం.. వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌పాటు ప్ర‌జ‌ల‌తోనే ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండేలా కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ణాళిక సిద్ధం చేయ‌నున్నట్టు చెప్పారు. ప్ర‌తి విష‌యంపైనా త‌క్ష‌ణమే స్పందించేలా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను సిద్ధం చేస్తామ‌న్నారు. క్విక్ రెస్పాన్స్ టీడీపీ పేరుతో నియ‌మించే కార్య‌క‌ర్త‌లు.. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతార‌ని పేర్కొన్నారు.

చిన్న స‌మ‌స్య నుంచి పెద్ద స‌మ‌స్య వ‌ర‌కు అన్నింటినీ క్షేత్ర‌స్థాయిలో సీరియ‌స్‌గానే తీసుకోవాల‌న్నారు. ఉదాహ‌ర‌ణ‌కు దోమ‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. మురుగు కాల్వ‌ల‌ను స‌రిగా శుభ్రం చేయ‌డంలేద‌ని క్షేత్ర‌స్థాయిలో ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని.. ఎమ్మెల్యేలు వాటిని లైట్ తీసుకుంటే కుద‌ర‌ద‌ని చెప్పారు. చిన్న పాటి స‌మ‌స్య‌ను కూడా ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన త‌ర్వాత పెద్ద‌దిగానే భావించాల్సి ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. త‌న‌తో స‌హా అంద‌రూ.. రెండేళ్ల పాల‌న‌పై ఒక‌వైపు ప్ర‌చారం చేస్తూనే.. మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఎవ‌రికి వారు క్షేత్ర‌స్థాయి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోవాల‌న్నారు.

ఏ ఒక్కరూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించేందుకు వీల్లేద‌ని తేల్చి చెప్పిన చంద్ర‌బాబు.. ప్ర‌తి విష‌యాన్నీ సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణించాల న్నారు. అవినీతికి దూరంగా ఉండాల‌ని ప‌దే ప‌దే చెప్పారు. అయిపోయిన కాలం తిరిగిరాదు. ఇప్ప‌టినుంచి అప్ర‌మత్తంగా ఉండాలి. ప్ర‌తిఒక్క‌రి ప‌నితీరును ప‌రిశీలిస్తాను. అని తేల్చి చెప్పారు. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై తాను కూడా ప‌ర్య‌వేక్షిస్తాన‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ సంఘ‌టితంగా కృషి చేస్తేనే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. అప్పుడు పాద‌యాత్రలు చేసేనా.. పొర్లు దండాలు పెట్టినా.. కూట‌మి గెలుపును ఆప‌లేర‌ని వ్యాఖ్యానించారు.