ఆలయ ఆస్తుల ధ్వంసానికి జగన్ బాధ్యత వహించాలి: పవన్

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని చారిత్రక రామాలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన పెను ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. రామతీర్థం ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం, పోలీసుల తీరు వివాదాస్పమైంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శలు గుప్పించారు.

ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేస్తున్నా జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తిన విధంగా వ్వవహరించడంపై మండిపడ్డారు. పాకిస్థాన్‌లో ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేశారని, ఆ ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఆపాటి చర్యలు కూడా తీసుకోలేదా? అని పవన్ ప్రశ్నించారు. ఆలయ ఆస్తుల ధ్వంసానికి జగన్ సర్కార్ బాధ్యత వహించాలని పవన్ డిమాండ్ చేశారు.

జగన్ పాలనలో రాష్ట్రంలో హిందూ విశ్వాసాలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మనకుండా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని పవన్ ఆరోపించారు. కనుకనే మతోన్మాదులు మరింతగా తెగబడుతున్నారని చెప్పారు.

హిందూ ఆలయాలపై వరుస ఘటనలను ప్రతి ఒక్కరం ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు. శక్తిపీఠం ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటన నుంచి తాజాగా రామతీర్థం, రాజమహేంద్రవరం వ్యవహారం వరకు ప్రభుత్వ స్పందన ఉదాసీనంగా ఉందని పవన్ మండిపడ్డారు. దేవుడిపై భారం వేసిన ప్రభుత్వ నిర్లిప్త ధోరణి ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడేవారిని మరింత ప్రోత్సహించేలా ఉందన్నారు.

హిందూ ధర్మంపై, దేవాలయా లపై సాగుతున్న దాడులను కట్టడి చేయాలంటే నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకొని కఠిన వైఖరి అవలంబించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు రాజకీయ రంగు పులిమి పక్కదోవ పట్టించకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు.