తమిళనాట అధికారాన్ని చేజిక్కించుకున్న స్టార్ హీరో దళపతి విజయ్… తన పార్టీ ప్రభుత్వ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సీఎం హోదాలో విజయ్ కొనసాగిస్తున్న పాలనను ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా అందిపుచ్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే… విజయ్ కేబినెట్ లోని దేవదాయ శాఖ మంత్రి రమేశ్.. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఓ ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. ఆలయంలో అక్రమాలకు పాల్పడుతున్న పలువురు ఉద్యోగులను ఆయన సస్సెండ్ చేశారు. రమేశ్ చేసిన ఈ తనిఖీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
విజయ్ కేబినెట్ లో దేవదాయ శాఖ మంత్రి పదవి దక్కించుకున్న రమేశ్… సీఎం మాదిరే తాను వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఉన్నారు. రాష్ట్రంలోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో రమేశ్ నేరుగా ఆ ఆలయానికి వెళ్లారు. అయితే ఆలయంలో తనను ఎవరూ గుర్తుపట్టకూడదన్న భావనతో ఆయన ముఖానికి మాస్క్ వేసుకుని మరీ ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చారు. సామాన్య భక్తుడి మాదిరిగా ఆయన సర్వదర్శనం, తలనీలాల సమర్పణ కేంద్రం, అన్నదాన కేంద్రాలతో పాటు ఆలయ పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ లో వెళుతున్న మంత్రిని ఓ ఆర్చకుడు పలకరించారు. స్వామి వారి దర్శనం వేగంగా కావాలంటే… రూ.1000 ఇవ్వాలంటూ కోరాడు. అయితే తన వద్ద నగదు లేదని మంత్రి సమాధానం చెప్పారు. అక్కడికీ తగ్గని ఆ అర్చకుడు నగదు లేకున్నా ఫరవా లేదు… గూగుల్ పేలో అయినా పంపవచ్చని తెలిపాడు. దీంతో మండిపోయిన మంత్రి సదరు అర్చకుడిపై అక్కడికక్కడే చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
అర్చకుడి మాదిరే మరో ఇద్దరు ఉద్యోగులు భక్తులను దోచుకుంటున్న తీరును గమనించిన మంత్రి వారిపైనా చర్యలకు ఆదేశించారు. మొత్తంగా మాస్క్ తో వెళ్లిన మంత్రి ఆ ఆలయంలో పనిచేస్తున్న ఓ పూజారి, ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తప్పించారు. ఈ చర్యతో స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులను మోసం చేయాలంటే అధికారులు భయపడేలా మంత్రి వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates