వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ కూడా అయిన అనంతబాబు ఇక, సుదీర్ఘ కాలం ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. వైసీపీ హయాంలో తన మాజీ కారు డ్రైవర్, దళితుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనను ఎవరు ప్రశ్నిస్తారులే.. అన్న ధోరణితో శవాన్ని డోర్ డెలివరీ కూడా చేశారు. ఈ ఘటన ఆనాడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే.. వైసీపీ హయాంలో దీనిని తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఈ కేసును తిరిగి పట్టాలెక్కించారు. అంతేకాదు.. సుప్రీంకోర్టు కూడా ఒకదశలో తీవ్రంగా స్పందించింది. శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితులతో పోలీసు అధికారులు కుమ్మక్కు కావడాన్ని తీవ్రంగా పరిగణించి.. ఈ కేసులో ప్రమేయం ఉన్న అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇదేసమయంలో కేసును మరింత వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఎమ్మెల్సీ.. అనంతబాబును పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.
అయితే..ఆయన అదే సుప్రీంకోర్టును ఆశ్రయించి.. పలు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. గత నెల 24వ తేదీ వరకు ఆయన బయటే ఉన్నారు. అయితే.. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిని బెదిరించడం.. వారికి లక్షల రూపాయలు లంచాలు ఇచ్చి.. కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడం వంటివాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గత నెల 24న మరోసారి అరెస్టు చేసి.. మరో కేసు నమోదు చేశారు. దీంతో ప్రస్తుతం అనంతబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు.
ఇక, హత్య కేసుకు సంబంధించి.. శవం డోర్ డెలివరీకి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ వచ్చినా .. ఆయన కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని.. పోలీసులు రాజమండ్రి కోర్టును ఆశ్రయించారు. సాక్షులను బెదిరించవద్దని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి.. సాక్షులను ప్రలోభాలకు గురి చేసి.. బెదిరించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తాజాగా బుధవారం ఉదయం అనంతబాబు బెయిల్‌ను రద్దు చేసింది. అంతేకాదు.. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయనను జైల్లోనే ఉంచాలని న్యాయాధికారి తీర్పులో పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates