కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు నమోదైన నాలుగు రోజుల తర్వాత భగీరథ్ కేసుపై విచారణ జరపాలంటూ సిట్ వేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక, భగీరథ్ పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పడంపై కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉండడం, పోలీసులకు దొరకకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును భగీరథ్ ఆశ్రయించారు.
భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 14న వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది. ఈ కేసును సీనయిర్ న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదించబోతుండడం విశేషం. గతంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
మరోవైపు, బాధితురాలి తల్లిదండ్రులను బండి సంజయ్ బెదిరించారని మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ ఇంటికి వెళ్లిన బాధిత బాలిక తల్లిదండ్రులను ఈ కేసు సెటిల్ చేసుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. బాధితులు బండి సంజయ్ ను కలిసిన రోజు కాల్ డేటా రికార్డింగ్, సీసీటీవీ ఫుటేజిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates