లెక్కలు మొత్తం బయటకి తీస్తానంటున్న విజయ్

త‌మిళ‌నాడు నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ తొలి ప్ర‌సంగంలోనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్ర‌జ‌ల సొమ్మును తినేందుకు.. వారిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు రాలేద‌న్నారు. ప్ర‌తి క్ష‌ణం ప్ర‌జ‌ల కోసం.. పేద‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త డీఎంకే ప్ర‌భుత్వంపై నిశిత విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త ప్ర‌భుత్వం 10 ల‌క్ష‌ల కోట్ల‌రూపాయ‌ల‌ను అప్పు చేసింద‌న్నారు.

అదేస‌మ‌యంలో ప్ర‌జాధ‌నాన్ని కూడా గ‌త పాల‌కులు దోచుకున్నార‌ని విమ‌ర్శించారు. ఎవ‌రెవ‌రు ఎంత దోచుకున్నారో లెక్క‌లు తీస్తామ‌ని.. ఖ‌జానాను ఖాళీ చేసిన వారిని వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. దీనిపై త్వ‌ర‌లోనే శ్వేత ప‌త్రం(వైట్ పేప‌ర్‌) విడుద‌ల చేయ‌నున్న‌ట్టు విజ‌య్ చెప్పారు. ఖ‌జానా ఖాళీ అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌తి హామీ త‌న‌కు గుర్తుంద‌న్నారు. అనుకున్న ల‌క్ష్యాల‌ను నెర‌వేరుస్తామ‌ని చెప్పారు.

రెండు కేంద్రాలు లేవు..

టీవీకే పార్టీలో రెండుమూడు అధికార కేంద్రాలు లేవ‌ని విజ‌య్ ఉద్ఘాటించారు. ఉన్న‌ది ఒక్క‌టే అధికార కేంద్రం అని వ్యాఖ్యానించారు. అది తానేన‌ని చెప్పారు. రెండు అధికార కేంద్రాల‌ను ఉండ‌వ‌ని, ఉండ‌నివ్వ‌న‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల కోసం.. ప‌నిచేయ‌డ‌మే క‌ర్త‌వ్యంగా వ‌చ్చాన‌న్నారు. త‌న‌ను ప్ర‌జ‌లు ఆహ్వానించార‌ని.. రా.. త‌మ్ముడూ అని పిలిచార‌ని అందుకే వ‌చ్చాన‌ని చెప్పారు. ఈ రాజ‌కీయ ప్ర‌యాణంలో అనేక అవ‌మానాలు ఎదుర్కొన్న‌ట్టు చెప్పారు. డ్ర‌గ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభ‌మైంద‌ని నొక్కిచెప్పారు.