తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ పరిణామాలకు తెరపడగా, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. మరి కొన్ని గంటల్లో చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని సమాచారం.

వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి. ఇండోర్ స్టేడియం వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా టీవీకే కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

ఇక కేరళలో మాత్రం ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపిక విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికే వదిలేసిన రాష్ట్ర నేతలు, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వీడీ సతీషన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల తమ అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

కేరళ సీఎల్పీ నేత ఎన్నికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ సేకరిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. పరిశీలకులతో సమావేశం అనంతరం సీనియర్ నేత వీడీ సతీషన్ కాంగ్రెస్ కార్యాలయం నుంచి వెనుదిరిగారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల నివేదికను ఏఐసీసీ అధిష్టానానికి పంపనున్నట్లు తెలుస్తోంది. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆదివారం తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.