రాఘవా… బీజేపీలో చేరడం కలిసి రాలేదా?

ఆప్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా..ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో ఈ పేరు మార్మోగిపోతోంది. సామాన్యుల పక్షాన పెద్దల సభలో గళం వినిపించిన రాఘవ్ చద్దాపై కొద్ది రోజుల క్రితం మీడియా, సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కట్ చేస్తే..ఆప్ ను వీడి బీజేపీలో చేరిన చద్దాపై అదే మీడియా, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా చద్దాను జెన్ జీ నేతగా భావించిన జెన్ జీ యువత ప్రస్తుతం ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. కొద్ది రోజుల గ్యాప్ లోనే చద్దా హీరో నుంచి జీరో అయ్యారు. ఈ క్రమంలోనే చద్దా ఒక్క రాత్రిలో ఇన్ స్టాలో లక్ష మంది ఫాలోవర్లను కోల్పోయిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీలో చేరక ముందు రాఘవ్ చద్దాకు ఇన్ స్టాలో1.46 కోట్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. అయితే, ఆప్ ను వీడి కమలం గూటికి చేరిన నేపథ్యంలో చద్దాకు నెటిజన్లు భారీ షాకిచ్చారు. 24 గంటల వ్యవధిలోనే సుమారు 10 లక్షల మందికి పైగా వ్యక్తులు ఆయనను అన్‌ఫాలో చేశారు. దీంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో చద్దా ఫాలోవర్ల సంఖ్య 1.35 కోట్లకు పడిపోయింది. ఆప్ నకు బద్ధ శత్రువైన బీజేపీలో చద్దా చేరడంతో ఆయనపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇన్ స్టా ఖాతాలో చద్దాపై యువత తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మొబైల్ రీచార్జ్ ల గురించి మాట్లాడిన వైనం చూసి చద్దా యువతరం ప్రతినిధి అనుకున్నామని, కానీ, ఆయన కూడా అందరు రాజకీయ నాయకుల మాదిరిగానే అవకాశవాద రాజకీయాలకు, స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చి పార్టీ మారారని విమర్శిస్తున్నారు.

ఆప్ లో అంతర్గత విభేదాలుంటే కేజ్రీవాల్ తో కలిసి మాట్లాడుకొని సరి చేసుకోవాల్సిందని, ఇలా పార్టీని వీడడం సరికాదని అంటున్నారు. అయితే, పార్టీలు మారిన సమయంలో నేతలకు ఇలా జరగడం కామన్ అని, బీజేపీలో చేరిన చద్దాను బీజేపీ యువత ఫాలో చేస్తారని, ఆ 10 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఆయనకు వస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.