తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ ఎస్) పార్టీని ప్రకటించిన మాజీ ఎంపీ, మాజీఎమ్మెల్సీ కవిత.. సంచలన ప్రకటనలు చేశారు. తాను తెలంగాణకు అమ్మగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. “నా మనసులో ఉన్న మాటను మీకు చెబుతున్నా. ఈ రాష్ట్రంలోని 3 కోట్ల 50 లక్షల మంది ప్రజలకు అమ్మగా ఉండాలని ఉంది. అలా అయితేనే.. మీ కష్టాలు తీర్చగలిగేందుకు.. అమ్మగా ఆ బాధ తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.“ అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ దారి తప్పారు!
తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ కారు.. తర్వాత కాలంలో దారి తప్పిందని కవిత విమర్శించారు. ఏ సబ్బండ వర్గాల కోసం.. పార్టీ ఏర్పడిందో ఆ వర్గాలను విస్మరించారని అన్నారు. గత ప్రభుత్వంలో తాను కూడా భాగస్వామ్యమైనందుకు.. ఆ తప్పుల్లో భాగం ఉన్నందుకు క్షమాపణలు చెబుతున్నానని కవిత చెప్పారు. అయితే..కేవలం క్షమాపణలకు మాత్రమే పరిమితం అయితే సరిపోతుందా? అని ప్రశ్నించిన కవిత.. తాను.. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని తెలిపారు.
తెలంగాణ ఆత్మ..
ఒకప్పుడు తెలంగాణ ఆత్మగా ఉన్న బీఆర్ ఎస్ పార్టీ.. దానిని కోల్పోయిందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొందరికే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. సామాజిక తెలంగాణ సాధిస్తానని చెప్పిన ఆయన.. ఏం చేశారని ప్రశ్నించారు. ఈ సాధన కోసమే తాను కొత్త పార్టీని పెడుతున్నానని చెప్పారు. గతంలో టీఆర్ ఎస్ పార్టీ కోసం.. తన రక్తాన్ని ధారపోసినట్టు కవిత తెలిపారు. తెలంగాణ ఉద్యమ కారులను అవమానించారని.. అయితే.. ఆ నాడు తాను మాట్లాడలేదని చెప్పారు. ఇప్పుడు తనకు కూడా అదే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ మరమనిషి..
కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కవిత సుదీర్ఘ ప్రసంగం చేశారు. `కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి` అని కవిత వ్యాఖ్యానించారు. ఒకప్పుడు చేనేతల కోసం భిక్షాటన చేసిన కేసీఆర్.. ఇప్పుడు పేదల ఇళ్లు కూలగొడుతున్నా.. ఎందుకు స్పందించడం లేదన్నారు. ఆయన మారిన మనిషి.. మర మనిషి.. అని కవిత దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను.. రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి.. కేంద్రంలో పెత్తనానికి బయలు దేరడం వల్లే.. బీఆర్ ఎస్‌కు ఈ గతి పట్టిందని విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates