విజయ్ గురించి చంద్రబాబు ఒక్కమాట

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ నేతృత్వంలోని అన్నాడీఎంకే కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌డానికి ముందు.. మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొత్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకున్న అగ్ర‌న‌టుడు విజ‌య్‌పై స్పందించారు. “విజ‌య్ పార్టీపై మీరేమంటారు?“ అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. “విజ‌య్ గురించి ఏం చెబుతాం. ఆయ‌న కొత్త‌గా పార్టీ పెట్టారు. కొత్త‌పార్టీల‌ను ప్ర‌జ‌లు ఏమేర‌కు స్వాగ‌తిస్తారో చూడాలి. ప్ర‌స్తుతం ఎన్డీయే వైపు ప్ర‌జ‌లు ఉన్నార‌ని నాకు అనిపిస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక చూడాలి.“ అని వ్యాఖ్యానించారు.

ఎన్డీయే గాలి..

త‌మిళ‌నాడులో ప్ర‌జ‌లు మార్పు దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నార‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఇది త‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపించింద న్నారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం త‌మిళ‌నాడు అభివృద్ధికి ఎంతో చేసింద‌ని.. ఈ విష‌యం ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా గ్ర‌హించార‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో మోడీ ద్వారానే త‌మ రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంద‌ని భావిస్తున్న‌ట్టు త‌న‌కు అర్ధ‌మైంద‌న్నారు. కొత్త‌పార్టీలు పెట్ట‌డం తేలికేన‌ని.. కానీ, ప్ర‌జ‌ల అభిమానం ఓట్ల రూపంలో రావ‌డం వేర‌ని.. ఎన్నిక‌ల రంగంలో ప్ర‌జ‌లు విజ్ఞుల‌ని వ్యాఖ్యానించారు. త‌మిళ‌నాడులో మార్పు ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

ఏపీకి పెట్టుబ‌డులు..

కేంద్రం స‌హ‌కారంతోనే ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌న్నారు. తమిళ‌నాడులో కూడా ఎన్డీయే ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. కావేరీ న‌ది అనుసంధానంతో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు తాగు, సాగునీరు అందించేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. పెట్టుబ‌డులు తీసుకురావ‌డం ద్వారా నిరుద్యోగాన్ని త‌గ్గించుకునే వెసులుబాటు ఉంటుంద‌న్నారు. త‌న రెండు రోజుల ప్ర‌చారంలో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎంతో స‌హ‌క‌రించార‌ని.. త‌మిళ‌నా డు త‌న‌కు కొత్త‌కాద‌ని గ‌తం నుంచే ఎంతో అనుబంధం ఉంద‌ని వ్యాఖ్యానించారు.

డీఎంకే విమ‌ర్శ‌లు..

ఇదిలావుంటే.. సీఎం చంద్ర‌బాబు పర్య‌ట‌న‌, ప్ర‌చారంపై త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌తంలో స్టాలిన్‌తో క‌లిసి మోడీపై చంద్ర‌బాబు యుద్ధం ప్ర‌క‌టించిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తూ.. ఇప్పుడు ఎలా స‌మ‌ర్థిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ మాయ‌లో చంద్ర‌బాబు ప‌డ్డార‌ని డీఎంకే అధికార ప్ర‌తినిధి న‌ల్ల‌క‌న్ను ఆరోపించారు. ఎంత మందిని దింపి ప్ర‌చారం చేసినా.. డీఎంకే విజ‌యాన్ని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని చెప్పారు. డీఎంకే జ్వ‌రంతో బీజేపీ బాధ‌ప‌డుతోంద‌ని.. దీనికి ప్ర‌జ‌లు 23న మందేస్తార‌ని ఎద్దేవా చేశారు. కాగా.. ఈనెల 23న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 234 స్థానాల‌కు ఒకే ద‌శ‌లో పొలింగ్ నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేశారు.