ఏపీ ఉద్యోగుల్లో ఇప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు ఐదేళ్ల పాటు తమకు తీరని అన్యాయం చేస్తే… ఇప్పుడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒకే ఒక్క దెబ్బతో ఆ అన్యాయాన్ని సరిదిద్దారు. గ్రాట్యూటీ పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవుల చెల్లింపులను కూటమి సర్కారు విడుదల చేసింది.
ఇందుకోసం ఒకే విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,950 కోట్లను విడుదల చేయగా… ఆ నిధులు తమ ఖాతాల్లో జమ అవుతున్న తీరు ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. తమ ఖాతాల్లో జమ అవుతున్న నగదును వారు తమ స్నేహితులకు చెబుతూ ఆనందంలో మునిగిపోయారు. ఈ చెల్లింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైసీపీ పాలనలో ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ చెల్లింపులు జరగలేదు. అదే సమయంలో ఉద్యోగులకు సరెండర్ లీవులకు సంబంధించిన చెల్లింపులపైనా నాటి సర్కారు శీతకన్నేసింది. వెరసి ఈ బకాయిలు వేల కోట్ల మేర పేరుకుపోయాయి. తమకు న్యాయంగా దక్కాల్సిన ఈ చెల్లింపులు దక్కకపోవడంతో ఉద్యోగుల్లో ఆవేదన నెలకొంది. అయితే నాటి ప్రభుత్వం అనుసరించిన దౌర్జన్యకాండకు భయపడిన ఉద్యోగులు ఈ విషయాలపై పెద్దగా గళం విప్పలేదు.
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం, టీడీపీ నేతృత్వంలోని కూటమికి రికార్డు మెజారిటీ దక్కడంతో ఉద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమకు రావాల్సిన బకాయిల గురించి వారు ప్రస్తావించారు. ఉద్యోగుల పక్షపాతిగా పేరున్న చంద్రబాబు వెంటనే ఈ అంశంపై సమగ్ర
నివేదికలు రూపొందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా… ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను విడతల వారీగా చెల్లించాలని ఆయన తీర్మానించారు.
తాజాగా పదవీ విరమణ పొందిన ఉద్మోగులకు సంబంధించిన గ్రాట్యూటీ బకాయిలు, సరెండర్ లీవుల బకాయిలను విడుదల చేసేందుకు రూ.2,950 కోట్లు అవసరం కాగా… ఆ నిధులను గురువారం విడుదల చేశారు. దీంతో సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో వారి గ్రాట్యూటీ, సరెండర్ లీవుల బకాయిల మొత్తం జమ అవుతోంది. ఇందులో కేవలం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే కాకుండా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సరెండర్ లీవుల మొత్తాలు కూడా విడుదల అవుతూ ఉన్నాయి. ఈ పరిణామంపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates