రాజకీయం ఇప్పుడు డబ్బు చుట్టూ నడుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా…ఇది పచ్చి నిజం. డబ్బు లేనిది ఏ ఒక్క నేత ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి. ఇక ఆయా పార్టీలు తమకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఆధారంగా తమకు దక్కిన ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లను కూడా డబ్బుకే అమ్ముకుంటున్నాయి.
ఈ విషయంలో సొంత పార్టీ నేతల వద్ద కూడా ఆయా పార్టీలు డబ్బును డిమాండ్ చేసి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఇలాంటి వ్యవహారానికి సంబంధించిన ఓ సంచలన ఘటన ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. ఎమ్మెల్సీ పదవి కావాలంటే.. రూ.30 కోట్లు కట్టాల్సిందే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తన నాయకుడికి ఓ కఠినమైన పరీక్ష పెట్టిందన్న ఆరోపణ మొదలయ్యింది.
ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా… ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఎమ్మెల్సీ సీట్ల కోసం బారులు తీరారు. ఇలాంటి వారిలో పటాన్ చెరుకు చెందిన ఆ పార్టీ యువ నేత నీలం మధు ఒకరు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న దీపాదాస్ మున్షీ.. నీలం మధును నేరుగానే రూ.30 కోట్లు డిమాంఢ్ చేశారట. ఎమ్మెల్సీ కావాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదని కూడా ఆమె మధుకు చెప్పారట. ఆ తర్వాత జరిగిన సంప్రదింపుల్లో పార్టీకి చెందిన కీలక నేత శ్రీనివాస్ యాదవ్ ఆ రేటును రూ.20 కోట్లకు దించారట.
సరే… ఈ వ్యవహారం మొత్తం బయటపడటంతో మున్షీ చేతిలో నుంచి పదవి చేజారింది. మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టారు. ఒకింత నిక్కచ్చిగానే వ్యవహరిస్తారన్న పేరున్న మీనాక్షి వద్ద ఈ డబ్బుల డిమాండ్ అితే ఇప్పటిదాకా వినిపించలేదనే చెప్పాలి. అయితే ఎమ్మెల్సీ గానీ, రాజ్యసభ సీటు గానీ దక్కించుకోవాలంటే… పార్టీ అధిష్ఠానానికి తప్పనిసరిగా కప్పం కట్టక తప్పదన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని బయటపెట్టిన నీలం మధు విషయానికి వస్తే… బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ చాలా కాలం నుంచి చట్టసభల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఆయన వ్యూహాల మీద వ్యూహాలు మారుస్తున్నారు. పటాన్ చెరు కాంగ్రెస్ లో కొత్తగా లుకలుకలకు నీలం వైఖరే కారణమన్న వాదనలు గట్టిగానే వినిపించాయి. ఎవరేమనుకున్నా పట్టించుకోని నీలం.. సొంత పార్టీ నేతల మీద కూడా సంచలన ఆరోపణలు గుప్పిస్తూ సాగుతున్నారు. మరి చట్టసభల్లో అడుగుపెట్టి తీరాలన్న నీలం కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates