జైలుకు వెళ్లేందుకు నాని రెడీ అయ్యారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కూటమి అధికారం చేపట్టిన తర్వాత పలు అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు సంధిస్తున్న నానిపై పలు కేసులు నమోదు అయినా… ఆయన అరెస్టు కాలేదు. అయితే తాజాగా నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పోలీసు అధికారులపై బాడీ షేమింగ్ చేశారంటూ నానిపై ఈ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నాని అరెస్టు తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే… గురువారం మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. పట్టణంలోని ఆరో వార్డులో ఇళ్ల కూల్చివేతల వద్దకు వెళ్లిన నాని…అక్కడ మునిసిపల్ అధికారులతో పాటుగా పోలీసుల తీరుపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

పోలీసు అధికారి జైపాల్ పై నాని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వాదనలూ వినిపించాయి. ఈ ఘటనలో నాని తీరును నిరసించిన కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం నానిపై చిలకలపూడి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు ఆయనను అరెస్టు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే… పోలీసులు తనపై కేసు నమోదు చేయడం, తన అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న పరిస్థితులను గమనించిన నాని… దిద్దుబాటు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం మీడియా మీట్ ఏర్పాటు చేసిన నాని… గురువారం నాటి ఘటనలో తానేమీ తప్పు చేయలేదన్నారు. విపక్షానికి చెందిన నేతగా ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించడమే తన ఉద్యోగమని ఆయన అన్నారు. తనను జైలులో పెట్టినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని కూడా ఆయన అన్నారు. అయినా జైపాల్ పై తాను బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయలేదన్నారు.

తప్పు చేసే అధికారులు ఏ విభాగానికి చెందిన ఉద్యోగులైనా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని, నిలదీస్తూనే ఉంటానని నాని పేర్కొన్నారు. జైపాల్ తప్పు చేశారు కాబట్టే ఆయన తీరును ప్రశ్నించానన్నారు. తనను జైపాల్ ఏకవచనంతో దూషించలేదా? అని ఆయన ప్రశ్నించారు.

జిల్లాలో 4 వేల మంది పోలీసులు పనిచేస్తున్నారని, వారిలో 3 వేల మంది నిజాయతీ కలిగిన అధికారులేనని…మిగిలిన వెయ్యి మంది జైపాల్ లాంటి వారేనని అన్నారు. అయినా నిన్నటి ఘటనలో తాను చేసింది తప్పే అయితే తనను ఏమైనా చేసుకోవచ్చని, అరెస్టు చేసినా భయపడబోనని నాని అన్నారు. ఈ సందర్భంగా జైపాల్ కు నమస్కరిస్తున్నానని చెప్పిన నాని… తనది తప్పే అయితే జైపాల్ తనను ఏమైనా చేసుకోవచ్చంటూ నాని పేర్కొనడం గమనార్హం.