వైసీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంపై అదే పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ నేతలు చేపట్టిన నిరసనలు పెద్ద డ్రామా. వాటిని ప్రజలు నమ్మరు. కేవలం రాజకీయ పబ్బం కోసమే ఈ నిరసనలు చేపట్టారు. వీటిలో పసలేదు. ప్రజలు నమ్మొద్దు.“ అంటూ దువ్వాడ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. అంతేకాదు.. సొంత పార్టీ ఎమ్మెల్సీనే ఇలా వ్యాఖ్యానించడం మరింత ఇరుకున పడేసింది.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో శ్రీకాకుళం జిల్లాలోని మూలపేటలో పోర్టును అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడి మత్స్య కారుల నుంచి భూములు కూడా తీసుకున్నారు. అయతే.. రెండేళ్లలో పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్న పోర్టుకు అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. ఫలితంగా వైసీపీ హయాం ఐదేళ్లలో దీనిని పూర్తి చేయలేక పోయారు. కాగా.. ప్రస్తుతం వచ్చిన కూటమి సర్కారు ఈ పోర్టును పూర్తిచేయాలని.. ఇటీవల వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. కానీ.. చంద్రబాబు మూలపేట పోర్టును పట్టించుకోవడం లేదన్నారు. తాను ప్రారంభించిన ప్రాజెక్టు కాబట్టే చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో మూల పేట పోర్టును పూర్తి చేయాలని కోరుతూ..సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. వందల మంది పార్టీ కార్యకర్తలు, మత్స్యకారులతో కలిసి ఆయన మూల పేట పోర్టు వరకు వెళ్లి.. నిరసన తెలపాలని అనుకున్నారు. కానీ.. పోర్టుకు 100 మీటర్ల దూరంలోనే ఈ నిరసన నిలిచిపోయింది. పోర్టులోపలికి కూడా వెళ్లలేదు. 100మీటరకు దూరంగా టెంట్లు వేసి.. అక్కడే ధర్మాన ప్రసంగించి.. కార్యక్రమాన్ని ముగించారు.
దువ్వాడ ఏమన్నారంటే..
ధర్మాన చేపట్టిన ఈ నిరసనపై ఇదేశ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు.. కీలక కామెంట్లు చేశారు. మూలపేట కోసం వైసీపీ చేపట్టిన నిరసన ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు. పోర్టులోకి వెళ్లి.. అక్కడ ఏం జరిగిందో చూసేందుకు అనుమతి ఉన్నా.. 40 మంది వరకు నాయకులు వెళ్లేందుకు అధికారులు అనుమతి ఇచ్చినా.. ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. 100 మీటర్ల దూరంలోనే కార్యక్రమాన్ని ఎందుకు ముగించారని.. ఇదంతా ఫక్తు నాటకమని వ్యాఖ్యానించారు.
మూల పేట పోర్టు కోసం త్యాగాలు చేసిన మత్స్యకారులను మోసం చేయడమేనని.. వైసీపీ నేతలు చేపట్టిన ధర్నాను నమ్మొద్దని దువ్వాడ పిలుపునిచ్చారు. మరి దీనిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. కాగా.. కొన్నాళ్లకిందట కూడా దువ్వాడతీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనకు టెక్కలి సీటు(మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు)ను తనకు ఇవ్వకపోతే.. పార్టీకి రాజీనామా చేసి.. ఒంటరిగా అయినా.. పోటీ చేసి గెలుస్తానని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
